ఏపీలో కూటమి సర్కార్ ఫ్రీ బస్ స్కీమ్‌ను అమల్లోకి తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే. ఏపీఎస్ఆర్టీసీ ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబోతుంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు మంగళగిరిలో ప్రారంభించబోతున్నారు. ఆడపిల్లలు, మహిళలు మరియు ట్రాన్స్ జెండర్లు తమ గుర్తింపు కార్డు చూపించి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇందుకు సంబంధించిన ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక మార్గదర్శకాలు సిద్ధం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం ఐదు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తుంది. ఈ జాబితాలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ వంటి బస్సులు ఉన్నాయి. ఏపీఎస్ఆర్టీసీలో మొత్తం 11,449 బస్సులు ఉంటే.. ఉచిత ప్రయాణం అమలు చేసే ఐదు రకాల బస్సుల సంఖ్య 8,458గా ఉంది. అంటే 74 శాతం బస్సులకు ఈ పథకం వర్తిస్తుంది.
ఆల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, నాన్ ఏసీ స్లీపర్ స్టార్‌లైనర్, ఏసీ బస్సులు, తిరుమల ఘాట్ బస్సులకు, శ్రీశైలం ఘాట్లలో తిరిగే ఎక్స్‌ప్రెస్ బస్సులకు ఫ్రీ బస్ స్కీమ్ వర్తించదని అధికారులు వెల్లడించారు. అలాగే నాన్‌స్టాప్ ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉండదు. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కొన్ని ఇంటర్ స్టేట్ సర్వీసులుగా ఏపీ నుంచి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు తిరుగుతున్నాయి. ఈ బస్సులకూ ఫ్రీ బస్ స్కీమ్ వర్తించదు.