దేశవ్యాప్తంగా రాఖీ పౌర్ణమి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ పండుగ సందర్భంగా అన్నా చెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు మంత్రి సంధ్యారాణి రాఖీ కట్టారు. చంద్రబాబు చేతికి రాఖీ కట్టే అదృష్టం తనకు దక్కిందని ఆమె హర్షం వ్యక్తం చేశారు.
తన సోదరుడు నందమూరి బాలకృష్ణకు దగ్గుబాటి పురందేశ్వరి రాఖీ కట్టారు. ఆ తర్వాత పురందేశ్వరి కాళ్లకు మొక్కి బాలయ్య బాబు ఆశీర్వాదం తీసుకున్నారు. ఇద్దరు ఒకరికి ఒకరు మిఠాయిలు తినిపించుకుని హర్షం వ్యక్తం చేశారు. రాఖీ పండుగ తనకు ఎంతో ఇష్టమైన రోజు అని, తన సోదరుడు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థించానని పురందేశ్వరి చెప్పారు. రాష్ట్ర ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల మధ్య బంధం ఎప్పుడూ బలంగా ఉండాలని ఆకాంక్షించారు.
మరోవైపు, మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ కు స్థానిక మహిళలు రాఖీ కట్టారు. సోదరి లేని తనకు మంగళగిరి మహిళలే అక్కచెల్లెళ్లు అని లోకేష్ అన్నారు. మంగళగిరి ఆడబిడ్డలదరికీ ఎప్పుడూ రుణపడి ఉంటానని చెప్పారు. రాఖీ కట్టి తనకు అక్క చెల్లెమ్మలు అందించిన ఆశీస్సులు కొండంత బలాన్ని ఇచ్చాయని లోకేష్ అన్నారు. మంగళగిరి అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, త్వరలోనే మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టబోతున్నానని, ఇళ్ల పట్టాల పంపిణీ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని లోకేష్ చెప్పారు. అందరి ఆశీస్సులతో మంగళగిరిని రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని లోకేష్ చెప్పారు.