పులివెందులలో వార్ వన్ సైడ్.. ఓట‌మి భ‌యంతో జ‌గ‌న్ కొత్త స్వ‌రం!

admin
Published by Admin — August 13, 2025 in Politics, Andhra
News Image

వైఎస్సార్‌ జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు మంగ‌ళ‌వారం ఎంతో ర‌స‌వ‌త్త‌రంగా ఉప ఎన్నిక జ‌రిగింది. పులివెందుల వైఎస్ జగన్‌ సొంత నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో గడచిన మూడు దశాబ్ధాలుగా ఎన్నిక‌లు జరిగిందేలేదు. ప్రతిసారి ఏకగ్రీవంగానే ఎన్నికలు జ‌రుగుతూ వ‌చ్చాయి. అయితే ఈసారి అధికారంలో ఉన్న టీడీపీ కూట‌మి పులివెందుల స్థానాన్ని ఎలాగైనా గెలుచుకోవాలని నిర్ణయించింది. అందులో భాగంగ‌నే టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బీటెక్‌ రవి సతీమణి లతారెడ్డికి టికెట్‌ కేటాయించ‌గా.. వైసీపీ నుంచి దివంగత జడ్పీటీసీ మహేశ్వర రెడ్డి కుమారుడు హేమంత్‌ రెడ్డి బరిలో దిగారు. వీరే కాకుండా పులివెందులలో మ‌రో 9 మంది అభ్య‌ర్థ‌లు కూడా పోటీ చేశారు. కానీ, లతారెడ్డి, హేమంత్‌రెడ్డి మధ్యే ప్రధాన పోటీ న‌డించింది.


పోలింగ్ రోజున ఉదయం నుంచే టీడీపీ, వైసీపీ నేత‌ల మ‌ధ్య ఉత్కంఠ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఇరు పార్టీ శ్రేణులు ఘర్షణల న‌డుమ పులివెందులలో 74.57 శాతం పోలింగ్ నమోదైంది. అలాగే ఒంటిమిట్టలో 70 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ముగిసిన‌ప్ప‌టికీ ప‌లు కార‌ణాల‌తో  ఏపీ ఎన్నికల సంఘం బుధ‌వారం 3, 14 పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వ‌హిస్తోంది. ఈ కేంద్రాల పరిధిలో మొత్తం వెయ్యి మంది ఓటర్లు ఉండ‌గా.. సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు రీపోలింగ్ జ‌ర‌గ‌బోతుంది.


అయితే పోలింగ్ సరళిని బట్టి చూస్తే గెలుపు తమదేనని, పులివెందులలో వార్ వన్ సైడ్ అయింద‌ని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సొంత నియోజ‌వ‌క‌ర్గంలో జ‌గ‌న్‌కు దెబ్బ ప‌డ‌టం ఖాయ‌మ‌ని అంటున్నారు. ఇదే త‌రుణంలో ఓట‌మి భ‌య‌మో ఏమో జ‌గ‌న్ కొత్త స్వ‌రం అందుకున్నారు. ఉప ఎన్నిక వేళ పులివెందుల‌లో చోటుచేసుకున్న‌ పరిణామాల‌పై జగన్ సీరియస్ అయ్యారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. 


`పులివెందుల నియోజకవర్గంలోని ఒక చిన్న జడ్పీటీసీ సీటును లాక్కునేందుకు, రాజంపేటలో మరో చిన్న ఒంటిమిట్ట జడ్పీటీసీ సీటును బలవంతంగా చెరబట్టేందుకు ఒక గూండా మాదిరిగా చంద్రబాబు అరాచకాలు చేసి,  ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేశారు. రాష్ట్రాన్ని రౌడీల రాజ్యందిశగా నడిపిస్తున్నారు. ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాన్ని దుర్వినియోగంచేస్తూ, అధికారులను చెప్పుచేతల్లోకి తీసుకుని, పోలీసులను వాడుకుని ఈ ఎన్నికను తీవ్రవాదుల మాదిరిగా హైజాక్‌ చేశారు. ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా గాయపరిచిన ఈరోజు నిజంగా ఒక  బ్లాక్‌ డే.  పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలను రద్దుచేయాలని, కేంద్ర బలగాల ఆధీనంలో తిరిగి ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్‌ చేస్తున్నాం.` అంటూ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.


చంద్ర‌బాబు గారు సీట్లో ఉండగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నది ఒక డొల్ల మాత్రమే అని, ఈ రాష్ట్రంలో రాజ్యాంగం, చట్టం, న్యాయం, ధర్మం, నిబంధనలు, ప్రజాస్వామ్య పద్ధతులు అన్నవి ఒట్టిమాటలేనని, వ్యవస్థలనేవి కేవలం అలంకార ప్రాయం మాత్రమేనని మరోమారు రుజువైంది అంటూ రెండు, మూడు పేజీలు వచ్చేలా జగన్ రెడ్డి త‌న ఆగ్ర‌హాన్ని మొత్తం ట్వీట్‌లో వెల్ల‌గ‌క్కారు. ఓట్లను రిగ్గింగ్‌ చేయగలరేమో కాని, ప్రజల హృదయాలను కాదంటూ డైలాగ్స్ కూడా పేల్చారు.


అయితే జ‌గ‌న్ ఆర్తనాదాలపై ప్ర‌జ‌లు వ్యంగ్యంగా రియాక్ట్ అవుతున్నారు. `ఎవరు గెలుస్తారో పక్కనపెడితే, 35 సంవత్సరాల తరువాత ప్రజలు ఓట్లు వేశారు. అదే ప్రజాస్వామ్యం. రాజారెడ్డి రౌడీ రాజ్యం అంతానికి నాంది` అని ఒక‌రు కామెంట్ చేయ‌గా.. `కంచుకోట లోని కోర్ మండ‌లంలో నీకు పోటీగా 10 మంది నామినేష‌న్స్‌ వేయడం ఏంటయ్యా. అంత చిన్న జడ్పీటీసీల్లో ఇంత వ్యతిరేకత ఏంటయ్యా` అంటూ జ‌గ‌న్ ను కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు.

Tags
YS Jagan Pulivendula Ontimitta Ap News YSRCP TDP ZPTC by-elections
Recent Comments
Leave a Comment

Related News