ఏపీ రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించిన పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించగా.. వైసీపీ డిపాజిట్ కోల్పోయి పరువు పోగొట్టుకుంది. పులివెందుల వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం. 1978 నుంచి వైఎస్ ఫ్యామిలీనే అక్కడ ఆధిపత్యం కొనసాగుతూ వస్తోంది. గత మూడు దశాబ్దాలుగా పులివెందులలో ఎన్నికలు జరిగిందే లేదు. 1995, 2001, 2006, 2021లో వైఎస్ ఫ్యామిలీ మద్దతుతో జడ్పీటీసీ ఎన్నిక ఏకగ్రీవం అవుతూ వచ్చింది. కానీ ఈసారి అధికారంలో ఉన్న టీడీపీ జగన్ ఆడ్డాలో సత్తా చాటాలని నిర్ణయించుకుంది.
అందులో భాగంగానే టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బీటెక్ రవి సతీమణి లతారెడ్డికి టికెట్ కేటాయించడమే కాకుండా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వంటి వారి చేత చంద్రబాబు విసృతంగా ప్రచారం చేయించారు. మరోవైపు వైసీపీ నుంచి దివంగత జడ్పీటీసీ మహేశ్వర రెడ్డి కుమారుడు హేమంత్ రెడ్డి బరిలోకి దిగగా.. మరో 9 మంది కూడా నామినేషన్లు వేశారు.
అయితే లతారెడ్డికి, హేమంత్ రెడ్డికి హోరాహోరీ పోరు ఉంటుందని అందరూ భావించారు. కానీ, టీడీపీ నేతలు మాత్రం వైసీపీ ఓటమికి కసితో పని చేశారు. కట్ చేస్తే పులివెందులను గెలిచి చంద్రబాబుకు గిఫ్ట్ ఇచ్చారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుకు కుప్పంలో ఘోర పరాభవం అంటూ ఎద్దేవా చేసిన వైసీపీని మరో కోలుకోలేని దెబ్బ కొట్టారు.
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయింది. జగన్ అడ్డాలో టీడీపీ ఘన విజయం సాధించింది. ఉప ఎన్నికలో మొత్తం 8,103 ఓట్లు పోల్ అవ్వగా.. బీటెక్ రవి భార్య మారెడ్డి లతారెడ్డి ఏకంగా 6,050 ఓట్ల భారీ మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు. ఇక వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి డిపాజిట్ కోల్పోయారు. ఆయనకు వెయ్యి ఓట్లు కూడా రాలేదు. కేవలం 685 ఓట్లు మాత్రమే హేమంత్ రెడ్డికి పడడంతో జగన్ ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయింది. జగన్ కంచుకోటను బద్దలు కొట్టడంతో కూటమి శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు.