పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత పులివెందులలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఏకగ్రీవం ట్రెండ్ ను చెరిపేసి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి. ఈ క్రమంలోనే జగన్ కంచుకోట పులివెందులను టీడీపీ బద్దలు కొట్టింది.
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి లతా రెడ్డి ఘన విజయం సాధించారు. తన ప్రత్యర్థి, వైసీపీ నేత హేమంత్ రెడ్డిపై లతా రెడ్డి 6035 ఓట్ల తేడాతో గెలుపొందారు. హేమంత్ రెడ్డికి కేవలం 683 ఓట్లు పోల్ కావడంతో డిపాజిట్ కోల్పోయారు. ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లోనూ టీడీపీ ఘన విజయం సాధించింది. వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డిపై 6,154 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి విజయం సాధించారు. ముద్దు కృష్ణారెడ్డికి 12,505 ఓట్లు పోల్ కాగా, సుబ్బారెడ్డికి 6,351 ఓట్లు పోలయ్యాయి. 1995 తర్వాత ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానంలో టీడీపీ జెండా ఎగరనుంది.
పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచిందని, ఒకరోజు ముందుగానే పులివెందులకు స్వాతంత్ర్యం వచ్చిందని మంత్రి సవిత వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నకల్లో జగన్ ను కూడా ఓడిస్తామని, పులివెందుల కోటను బద్దలు కొడతామని ధీమా వ్యక్తం చేశారు. తనను గెలిపించిన పులివెందుల ప్రజలకు, తన గెలుపు కోసం కష్టపడ్డ టీడీపీ నేతలు, కార్యకర్తలకు లతా రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.