కర్ణుడి చావుకు 100 కారణాలు...కానీ, 2024 ఎన్నికల్లో జగన్ ఓటమికి ఒక్కటే కారణం! నియంత పోకడ...తనను కలిసేందుకు వచ్చిన నేతలు, కార్యకర్తలను కలవకుండా మోనార్క్ లా ప్రవర్తించడం...ఇలా కేడర్ ను దూరం చేసుకున్న జగన్ గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యాయి. అయినా సరే పరాభవం నుంచి జగన్ పాఠాలు నేర్చుకోలేదు. ఇప్పటికీ అదే ధోరణి..అదే అహంకారం... ఈ మాటలు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు చెప్పడం లేదు. వైసీపీ సీనియర్ నేత నేరెడ్ల వీరారెడ్డి స్వయంగా జగన్ ఒంటెత్తు పోకడ గురించి చెప్పిన వైనం చర్చనీయాంశమైంది.
కుప్పం నుంచి కొందరు కార్యకర్తలు జగన్ ను కలిసేందుకు విజయవాడ వచ్చి రెండు రోజులు వేచి చూశారని, కానీ, వారిని ఆయన కలవలేదని వీరా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే కార్యకర్తలను కలవని జగన్...అధికారంలో ఉన్నపుడు ఏవిధంగా చేసి ఉంటారో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. తమను కలవని నాయకుడిని కార్యకర్తలు, ప్రజలు ఎలా నమ్ముతారని ఆయన ప్రశ్నించారు.
రఘురామను టార్చర్ చేయడంతో రాజులు దూరమయ్యారని, ఎస్సీ, ఎస్టీలు అనే సరికి బ్రాహ్మణుల వంటి అగ్రకులాలు దూరమయ్యాయని, ఇలా అన్ని కులాలను జగన్ దూరం చేసుకున్నారని చెప్పారు. ముఖ్యంగా రెడ్లు దూరం కావడంతోనే వైసీపీకి 11 సీట్లు వచ్చాయని ఆయన చెబుతున్నారు. గ్రౌండ్ లెవెల్లో కేడర్ ను జగన్ పట్టించుకోలేదని, అందుకే వైసీపీ ఓట్లు చీలిపోయి ఓటమిపాలయ్యామని అన్నారు. బటన్ నొక్కుడం మీద ఫోకస్ చేసిన జగన్ మిగతా విషయాలు పట్టించుకోలేదని, అది ప్రజలకు నచ్చలేదని చెప్పారు.