మాజీ సీఎం జగన్‌పై సీనియర్ మంత్రి, 2019-24 మధ్య వైసీపీ ఎమ్మెల్యేగా వ్యవహరించిన ఆనం రామనారా యణ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ``మరో ఏడాదికి జగన్ పూర్తిగా పిచ్చివాడవుతాడు`` అని సంచల న వ్యాఖ్యలు చేశారు. అధికారం పోయిందన్న ఒత్తిడి.. జగన్‌లో ఇంకా పోలేదన్న ఆనం.. ఇది పెరిగి పెద్ద దవుతోందని అన్నారు. ఆయనను ఎవరైనా జాగ్రత్తగా చూసుకోవాలని ఎద్దేవా చేశారు. నెల్లూరులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
జగన్‌కు అధికార వ్యామోహం పట్టుకుందని ఆనం విమర్శించారు. కానీ, ప్రజలు.. జగన్‌ను వద్దని ఎడం చేత్తో విసిరికొట్టారని, అయినా బుద్ధి రాకుండా.. ఇంకా ఈవీఎంలు, ఓట్ల చోరీ అంటూ.. విమర్శలు చేస్తున్నా రని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకోలేదని, కనీసం సమస్యలు చెప్పేందుకు తమ లాంటి వారికి అవకాశం కూడా ఇవ్వలేదన్నారు. వెంకటేశ్వరస్వామిదర్శనం అయినా.. దొరికింది కానీ.. జగన్ తమకు అప్పాయింట్‌మెంటు ఇవ్వకుండా వేధించారని.. ఇప్పుడు దాని ఫలితం అనుభవిస్తు న్నారని వ్యాఖ్యానించారు.
``జగన్‌లో నిరాశ, నిస్పృహలు పెరిగిపోయాయి. ఆ పార్టీ కూడా.. కొన్నాళ్లలో అంతరించి పోతుంది. మరో రెండు ఎన్నికలు వస్తే.. ఇక, పూర్తిగా జెండా పీకేస్తారు. అప్పుడు జగన్ ఒత్తిడి మరింత పెరిగి.. ఏడాదిలోనే ఆయన పిచ్చివాడవుతాడని నాకనిపిస్తోంది. ఎవరికైనా అధికార వ్యామోహం పనికిరాదు. అది ప్రజలు ఇస్తారు. మనం తెచ్చుకునేది కాదు. ప్రజలకుఏం చేశారని జగన్‌కు ముఖ్యమంత్రి పీఠం ఇవ్వాలి.`` అని నిప్పులు చెరిగారు.
మళ్లీ కూటమి అధికారంలోకి వస్తుందని ఆనం చెప్పారు. సంక్షేమ పథకాలను అన్నింటినీ అమలు చేస్తున్నారని.. ప్రకృతి విపత్తులు వస్తే.. వెంటనే పరిహారం కూడా ఇస్తున్నారని చెప్పారు. ప్రజలు ఇప్పుడు సంతోషంగా ఉన్నారని, అందుకే జగన్ బయటకు రాకుండా.. బెంగళూరులోనే ఉంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల మధ్యకు వచ్చినా.. ఆయనకు పనేమీ లేదన్నారు. అసెంబ్లీ సమావేశాలకు వస్తారా? రారా? అనేది వారిష్టమని ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు. సమావేశాలకు రాని వారిని.. జీతాలు ఇవ్వడం సరికాదని.. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని ఆనం వెల్లడించారు.