టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ప్రకారం ఒక ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే, ఆ ఆడియోలోని వాయిస్ తనది కాదని, తనకు నందమూరి నారా కుటుంబాలతో మంచి అనుబంధం ఉందని, తాను నందమూరి కుటుంబం అభిమానిని అని ప్రసాద్ అంటున్నారు. ఒకవేళ ఎవరైనా బాధపడితే క్షమించాలని కోరారు.
అయితే, తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్న జూ.ఎన్టీఆర్ అభిమానులు...దగ్గుబాటి ప్రసాద్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆయన ఇంటి ముందు వందలాది అభిమానులు నిరసనకు దిగారు. ప్రసాద్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన అభిమానులు...ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, కార్యాలయం ముందు ఉన్న ప్రసాద్ ఫ్లెక్సీలను ఫ్యాన్స్ చించివేశారు. గదుల్లో చెప్పే క్షమాపణలు తమకు వద్దని అన్నారు. రేపు సాయంత్రంలోగా ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ప్రసాద్ ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.