దగ్గుపాటి ప్రసాద్.. నిన్నట్నుంచి ఏపీ రాజకీయాల్లో మార్మోగుతున్న పేరు. తెలుగుదేశం పార్టీ తరఫున అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే ఆయన. జూనియర్ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి ఒక ఫోన్ కాల్‌లో దారుణమైన బూతులు తిట్టడంతో ప్రసాద్ మీద తారక్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. రాజకీయంగా అనంతపురంలో ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది.
ఎమ్మెల్యే ఇంటి ముందు తారక్ ఫ్యాన్స్ ధర్నాకు దిగడం.. ప్రసాద్ సారీ చెప్పినా వాళ్లు శాంతించకపోవడం.. వైసీపీ వాళ్లకు ఈ టాపిక్ పెద్ద ఆయుధంలా మారి తారక్ ఫ్యాన్స్‌ను వాళ్లు రెచ్చగొట్టడం.. ఇలా ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇది తెలుగుదేశం పార్టీకి కచ్చితంగా ఇబ్బందికరం అనడంలో సందేహం లేదు.
సోషల్ మీడియాలో టీడీపీ వర్గాలు ఈ ఉదంతంతో కొంత ఆత్మరక్షణలో పడ్డాయి. వ్యవహారం చంద్రబాబు, లోకేష్‌ల వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ప్రసాద్ మీద చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.
దగ్గుపాటి ప్రసాద్ గత ఏడాదే ఆయన తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. చివరి నిమిషంలో టికెట్ దక్కించుకుని.. కూటమి వేవ్‌లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ఐతే ఎమ్మెల్యే అయి ఏడాది తిరక్కముందే ఆయన మీద నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత నెలకొన్నట్లు తెలుస్తోంది. బలవంతపు వసూళ్లు, అవినీతి వ్యవహారాల్లో ఆయన తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అనంతపురం జిల్లాలో అత్యంత వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల్లో ఒకరిగా ఆయన పేరు ఇప్పటికే నానుతోంది. ప్రసాద్ వ్యవహారాలు ఇప్పటికే చంద్రబాబు దృష్టికి వచ్చాయి కూడా.
ఇప్పుడు ఎన్టీఆర్‌ను తిట్టిన ఉదంతంతో ప్రసాద్ మరింత వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ప్రసాద్ చేసిన పనితో.. చంద్రబాబు, లోకేష్‌లకు సంబంధం లేకపోయినా, వాళ్లే ఇలాంటివి తెర వెనుక నుంచి చేయిస్తున్నారని తారక్ ఫ్యాన్స్ అపార్థం చేసుకునే పరిస్థితి తలెత్తింది. ఓవైపు ‘వార్-2’ సినిమాకు అదనపు రేట్లు ఇచ్చి సహకారం అందిస్తే.. మరోవైపు ప్రసాద్ వ్యవహారం వల్ల తారక్ సినిమాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లుగా నింద మోయాల్సి వస్తోంది.
ఇది చంద్రబాబు, లోకేష్ ఇద్దరికీ తీవ్ర ఆగ్రహం తెప్పించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉన్న ఆరోపణలు చాలదని తాజా ఉదంతంతో మరింత వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రసాద్‌కు టీడీపీలో తీవ్ర ఇబ్బందికర పరిణామాలు తప్పవని, ఇంకోసారి ఆయనకు టికెట్ లభించడం కూడా కష్టమనే చర్చ జరుగుతోంది.