ఉమ్మడి అనంతపురం జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గం అంటేనే.. రాజకీయ వివాదాలకు కేరాఫ్‌గా మా రిపోయింది. వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే.. చాలు భగ్గుమనేలా ఇక్కడి రాజకీయాలు ఉన్నా యి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డికి మధ్య రాజకీయ వివాదాలు ముసురుకున్న విషయం తెలిసిందే. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. తమను వేధించారని, అక్రమ కేసులు పెట్టారని, తమ ఇంటిపైకి పెద్దారెడ్డి దాడి చేసేందుకు వచ్చారని ప్రభాకర్ రెడ్డి రగిలిపోతున్నారు.
ఇక, వైసీపీ ఓడిన తర్వాత.. జేసీ కుమారుడు అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత.. ఈ వివాదాలకు మరింత పదును పెరిగింది. పెద్దారెడ్డిని నియోజకవర్గంలోకి అడుగు పెట్టనిచ్చేది లేదని.. ప్రభాకర్ రెడ్డి తేల్చి చెబుతున్నారు. అన్నట్టే ఆయన చేస్తున్నారు. అయితే.. తాడిపత్రిలోని తన నివాసాన్ని మునిపల్ అధికారులు కూల్చే ప్రయత్నం చేస్తున్నారని.. తాను ఆక్రమించకపోయినా.. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించినట్టు చెబుతూ.. ఇంటిపై పడుతున్నారని పెద్దారెడ్డి ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆయన తన ఇంటిని పరిరక్షించుకునేందుకు గత నెలలోనే తాడిపత్రిలోకి వెళ్లే ప్రయ త్నం చేశారు.కానీ, జేసీ వర్గం పెద్దారెడ్డిని అడ్డుకుంది. అప్పట్లో పెను వివాదానికి దారితీయడంతో పెద్దారెడ్డిని పోలీసులు తాడిపత్రికి రాకుండా అడ్డుకున్నారు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తన ఇంటిని పరిరక్షించుకునేందుకు తాను వెళ్లాలని.. అనుమతి ఇచ్చి.. భద్రత కూడా కల్పించాలని కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. సోమవారం పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది.
ఉదయం 10 గంటల తర్వాత.. నియోజకవర్గంలోని తన ఇంటికి వెళ్లవచ్చని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. స్థానిక పోలీసులు పెద్దారెడ్డికి భద్రత కల్పించాలని కూడా.. ఆదేశించింది. దీంతో పోలీసులు సుమారు 750 మందితో భద్రత కల్పించారు. మరోవైపు.. జేసీ ప్రభాకర్ రెడ్డిని ఇంటి నుంచి బయటకు రాకూడదని పేర్కొంటూ..నోటీసులు కూడా ఇచ్చారు. కానీ. పెద్దారెడ్డి ఎలా వస్తాడో చూస్తానంటూ.. జేసీ వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి తాడిపత్రి హాట్ హాట్‌గా మారింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
ఈ క్రమంలోనే పెద్దారెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డి బస్తీ మే సవాల్ విసిరారు. "కేతిరెడ్డీ.. దమ్ముంటే తాడిపత్రికి రా.. తేల్చుకుందాం" అంటూ బహిరంగ సవాల్ విసిరారు. పెద్దారెడ్డిని పట్టణంలోకి అడుగుపెట్టనివ్వబోమని ఈ ఫైర్ బ్రాండ్ నేత తేల్చిచెప్పారు.