జగన్ ఐదేళ్ల పాలనలో అమరావతిపై ఏ రేంజ్ లో బురదజల్లారో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. చిన్న వర్షానికే అమరావతి మునిగిపోయిందంటూ బ్లూ మీడియాలో విష ప్రచారం చేసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. అధికారం పోయినా సరే...అమరావతిపై వైసీపీ నేతల అక్కసు తీరినట్లు కనిపించడం లేదు. కొంతకాలంగా కురుస్తున్న వర్షాలకు అమరావతి మునిగిపోయిందంటూ మళ్లీ దుష్ప్రచారం మొదలుబెట్టారు. ఈ క్రమంలోనే ఆ విష ప్రచారాన్ని ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు.
అమరావతిపై నిత్యం విషం చిమ్మడం, తప్పుడు ప్రచారం చేయడమే వైసీపీ పని అని చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతి మునిగిపోమయిందని, ప్రాజెక్టులు కొట్టుకుపోయాయని విష ప్రచారం చేయడం వారికి అలవాటని దుయ్యబట్టారు. తమ సొంత పత్రిక, టీవీ ఛానెళ్లలో వైసీపీ అసత్య ప్రచారం జోరుగా చేస్తోందని మండిపడ్డారు. ఊళ్లకు ఊళ్లు మునిగిపోతున్నాయని కథనాలు ప్రసారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటువంటి తప్పుడు వార్తలతో ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ దుష్ప్రచారాన్ని ఎప్పటికప్పుడు ఖండించాలని మంత్రులకు, ఎమ్మెల్యేలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. కాగా, అమరావతి రాజధాని పరిధిలో 904 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు కల్పించబోతున్నామని పురపాలక శాఖా మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. రోడ్ల నిర్మాణం కోసం 339 కోట్ల రూపాయలు, అమరావతిలో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కోసం 411 కోట్లు కేటాయించామన్నారు. త్వరలోనే టెండర్లు పిలుస్తామని చెప్పారు.