మాజీ సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు ఆరేళ్లుగా కొనసాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసును తొలుత విచారణ జరిపిన అధికారి రాంసింగ్ తో పాటు వివేకా కూతురు సునీత రెడ్డి, వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డిలపై గతంలో కేసులు నమోదయ్యాయి. అయితే, అప్పటి ప్రభుత్వం వీరిపై కక్షపూరితంగా కేసులు నమోదు చేసిందని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ కేసులను కోస్ట్ చేస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈరోజు ప్రకటించింది.
సునీత తరఫున ప్రముఖ లాయర్ సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. సునీత, రాజశేఖర్ రెడ్డి దంపతులతో పాటు రాంసింగ్ పై కుట్రపూరితంగా కేసులు నమోదు చేశారని సుప్రీంకోర్టు ధర్మాసనానికి లూథ్రా వివరించారు. ఈ క్రమంలోనే ఆ కేసులను క్వాష్ చేస్తామని న్యాయమూర్తి ప్రకటించారు. అంతేకాకుండా, వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డితో పాటుగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుల బెయిల్ రద్దు చేయాలని లూథ్రా కోరారు.
సుప్రీంకోర్టు నిర్దిష్ట గడువు విధించిన కారణంతోనే దర్యాప్తు ముగిసినట్లు సీబీఐ చెబుతుందని న్యాయమూర్తికి వివరించారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరపాల్సిన అవసరముందన్నారు. వివేకా హత్య వెనుక అసలు సూత్రధారులు, పాత్రధారులు బయటకు రావాల్సి ఉందని పేర్కొన్నారు. దర్యాప్తు సమయంలో వివేకా హత్య కేసులో సాక్షులను బెదిరించడం సాక్షాలను నాశనం చేయడం వంటి ప్రయత్నాలు జరిగాయని కోర్టు దృష్టికి తెచ్చారు.