ఏపీ విపక్షం వైసీపీ నాయకులపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ధ్వంసం చేసిన వ్యవస్థలను ఇప్పుడిప్పు డే చక్కదిద్దుతున్నామని.. దీనిని చూసి వారు ఓర్వలేక పోతున్నారని ఆయన అన్నారు. అందుకే.. ప్రతి అంశంపైనా విషం చిమ్ముతున్నారని దుయ్యబట్టారు. ప్రధానంగా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో అమరావతి మునిగిపోతోందని.. నీటితో రాజధాని ప్రాంతం సముద్రంగా మారిపోయిందని వైసీపీ అనుకూల మీడియాలో జరుగుతున్న ప్రచారంపై చంద్రబాబు మండిపడ్డారు. నిత్యం విషయం చిమ్ముతున్నారని, వీరిని అన్ని విధాలా కట్టడి చేస్తామని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా అధికారులు సదరు వ్యతిరేక ప్రచారం చేస్తున్న కొన్ని ఛానెళ్లపై తాము కేసులు పెట్టామని సీఎంకు వివరించారు. అయితే.. ఒకటి రెండు సార్లు స్పందించడం కాదని, ప్రతి ప్రచారానికీ స్పందించాలని.. లేకపోతే.. విష ప్రచారాన్ని ప్రజలు నమ్మే అవకాశం ఉందని, ఎంతో మంచి చేసినా.. ప్రయోజనం ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. ``ఎవరు చెప్పారు వీళ్లకి.. ఇంత విష ప్రచారం చేస్తారా? ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించొద్దు.`` అని అధికారులకు తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మంత్రులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. ``ఇంత వ్యతిరేక ప్రచారం జరుగుతుంటే.. మీరు ఏం చేస్తున్నారు? `` అని వారిని ప్రశ్నించారు.
మీరు ఎక్కడున్నా.. ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరించేందుకు ముందుకురావాలని వారికి చంద్రబాబు సూచించారు. తప్పు డు ప్రచారాలను ఎప్పటికప్పుడు ఖండించాలని, లేకపోతే.. ప్రభుత్వం చేస్తున్న మంచి పోతుందని నేతలకు ఆయన సూచించా రు. ``రాజధాని సహా ప్రభుత్వం అమలు చేస్తున్న పలుసంక్షేమ కార్యక్రమాలపైనా విష ప్రచారం చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు తొలిసారి ఉచిత ప్రయాణం కల్పించాం. దీనిపై మహిళలు ఆనందంగా ఉన్నారు. కానీ, వారు తమ ఓటు బ్యాంకు పోతోందని ఆందోళనలో ఉన్నారు. అందుకే విష ప్రచారం చేస్తున్నారు. మీరు ఎట్టి పరిస్థితిలోనూ ఊరుకోవద్దు.`` అని చంద్రబాబు తేల్చి చెప్పారు.
వైసీపీ నేతలు, అనుకూల మీడియా చేస్తున్న విష ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టేందుకు, బలమైన వాదనలు వినిపిం చేందుకు మంత్రులు, పార్టీ నేతలు చొరవ చూపాలన్నారు. ప్రజలకు మంచి-చెడులను ఆధారాలతో వివరించే ప్రయత్నం చేయాలన్నారు. ఇక, రాజకీయ ముసుగులో ఉన్న రౌడీలను ఎక్కడికక్కడ కట్టడి చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు. ఇదేసమయంలో నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు వివాదాలకు కడు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. ఎవరిపై విమర్శలు వచ్చినా.. వ్యక్తిగతంగా వారిని పిలిచి వివరణ కోరతానని హెచ్చరించారు.