ప్రముఖ సినీ నటుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్ తగిలింది. ప్రభుత్వ నిధులను ఆయన తన `హరిహర వీరమల్లు` సినిమా కోసం ఉపయోగించారని ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన తొలి చిత్రం హరిహర వీరమల్లు. ఈ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ జూలై 24న విడుదల అయింది. కానీ అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు.
ఆ సంగతి పక్కన పెడితే.. తాజాగా మాజీ ఐఏఎస్ అధికారి ఎస్. విజయ్ కుమార్ పవన్ కళ్యాణ్ పై సంచలన ఆరోపణలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. హరిహర వీరమల్లు సినిమా ప్రచార కార్యక్రమాల కోసం పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వ నిధులను వాడుకున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. పవన్ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని.. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని విజయ్ కుమార్ కోరారు.
అయితే విజయ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు స్వీకరించడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. విజయ్ వేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. కేసు విచారణ జాబితాలో సీబీఐ, ఏసీబీ న్యాయవాదుల పేర్లు చేర్చాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది.