రమణ (తెలుగులో ఠాగూర్), గజిని, తుపాకి, కత్తి లాంటి బ్లాక్‌బస్టర్లలో ఒకప్పుడు వైభవం చూసిన దర్శకుడు మురుగదాస్. కానీ ‘స్పైడర్’ దగ్గర్నుంచి ఆయన జాతకం తిరగబడిపోయింది. వరుస డిజాస్టర్లతో రేసులో బాగా వెనుకబడిపోయాడు. చివరగా సల్మాన్ ఖాన్‌తో ఆయన తీసిన ‘సికందర్’ మరీ దారుణమైన ఫలితాన్ని అందుకుంది.
ఈ సినిమా చూశాక మురుగదాస్ పూర్తిగా ఔట్ డేట్ అయిపోయాడనే ఫీలింగ్ కలిగింది ప్రేక్షకులకు. ఏ సినిమా ఫలితానికైనా అంతిమంగా దర్శకుడే బాధ్యుడు అయినప్పటికీ.. ‘సికందర్’ రిజల్ట్ విషయంలో మాత్రం తన ప్రమేయం ఏమీ లేదన్నట్లుగా మురుగదాస్ మాట్లాడుతుండడం విశేషం. ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘సికిందర్’ సినిమాపై తన కంట్రోల్ లేదని వ్యాఖ్యానించాడు మురుగ.
ఇప్పుడు మరో ఇంటర్వ్యూలో ఈ సినిమా ఫలితం గురించి ఇంకాస్త లోతుగా మాట్లాడాడు. ఈ సినిమా ఫెయిల్యూర్‌కు పూర్తిగా సల్మానే బాధ్యుడు అన్నట్లుగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చేయడం గమనార్హం.
‘సికందర్’ సినిమాను తాను రాసుకున్న స్క్రిప్టు ప్రకారం తెరకెక్కించలేదని మురుగదాస్ తెలిపాడు. హీరో సల్మాన్ ఖాన్‌కు సంబంధించిన టీం ఆన్ ద స్పాట్ చాలా మార్పులు చేసిందని మురుగదాస్ తెలిపాడు. ఇంప్రొవైజేషన్ల పేరుతో కొంతమేర స్క్రిప్టులో మార్పులు చేర్పులు చేయడం మామూలే అని.. కానీ ‘సికందర్’ సినిమాకు సంబంధించి చాలా మారిపోయిందని మురుగదాస్ తెలిపాడు. ఇక ‘సికందర్’ షూటింగ్ మొత్తం రాత్రి పూటే జరిగిందని... నైట్ 9 గంటలకు మొదలై తెల్లవార్లు చిత్రీకరణ జరిగేదని.. డే ఎఫెక్ట్‌ను కూడా లైటింగ్ పెట్టి రాత్రి పూటే చిత్రీకరించేవాళ్లమని మురుగదాస్ తెలిపాడు.
సల్మాన్‌కు ప్రాణ హాని ఉన్నట్లు వార్తలు రావడంతో అలా చేయాల్సి వచ్చిందని.. దీనికి తోడు సల్మాన్ ఖాన్ షూటింగ్‌కు చాలాసార్లు ఆలస్యంగా వచ్చేవాడని.. ఇలా చాలా విషయాలు ఈ సినిమా విషయంలో నెగెటివ్ అయ్యాయని మురుగదాస్ చెప్పాడు. ఐతే ఇలాంటి విషయాలు కొంత మేర సినిమా ఔట్‌పుట్‌ను దెబ్బ తీసి ఉండొచ్చు కానీ.. అంత పెద్ద డిజాస్టర్ కావడానికి మొత్తం సల్మానే కారణమని తేల్చేసి తన బాధ్యత ఏమీ లేదన్నట్లుగా మురుగదాస్ స్థాయి దర్శకుడు మాట్లాడడం పట్ల విమర్శలు వస్తున్నాయి.