నంద్యాల జిల్లా శ్రీశైలంలో అటవీ శాఖ ఉద్యోగులపై టీడీపీ ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి, ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. తమను రాజశేఖర రెడ్డి, ఆయన అనుచరులు కిడ్నాప్ చేసి గంటల తరబడి దాడి చేశారని పోలీసులకు అటవీ శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉందని, అయినా తమ ఆదేశాలు పాటించరా, తమకు సహకరించరా అని బెదిరింపులకు దిగారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. స్వయంగా ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి వాహనం నడుపుతూ తెల్లవారుజామున 2 గంటల వరకు ఆ ప్రాంతంలో తిప్పుతూ తమపై దాడి చేశారని ఆరోపించారు.
ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై సీనియర్ అధికారులతో మాట్లాడి పూర్తి నివేదిక సమర్పించాలని కోరారు. తక్షణమే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని పోలీసులను చంద్రబాబు ఆదేశించినట్లు తెలుస్తోంది. కొందరు టీడీపీ ఎమ్మెల్యేల వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తోందని చంద్రబాబు పార్టీలోని కొందరు నేతలతో అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. హీరో జూ.ఎన్టీఆర్ ను దుర్భాషలాడారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పై కూడా చంద్రబాబు సీరియస్ అయ్యారట.
సూపర్ సిక్స్ లో హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఈ ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందుతోంది. ఆర్థిక ఇబ్బందులున్నా సరే పథకాలు అమలు చేసేందుకు శ్రమిస్తున్న సీఎం చంద్రబాబుకు ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు సహకరించాల్సింది పోయి ఇలా కొత్త చిక్కులు తెచ్చి పెట్టడంపై టీడీపీ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.