బీఆర్ ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత వ్యవహారం కీలక మలుపు తిరిగింది. పార్టీపై ఆమె గోప్యంగా చేస్తున్న పెను యుద్ధం గురించి అందరికీ తెలిసిందే. డియర్ డాడీ లేఖ నుంచి ఇప్పటి వరకు కూడా తనకంటూ ప్రత్యేక అజెండాను ఏర్పాటు చేసుకుని ప్రజల మధ్యకువెళ్తున్నారు. జాగృతి సంస్థ ఆధ్వర్యంలోనే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. గతంలో ఎక్కడికెళ్లినా.. ఏం మాట్లాడినా.. ఏవేదికెక్కినా.. ఆమె మెడలో గులాబీ కండువా కనిపించేది. కానీ, `డియర్ డాడీ` లేఖ తర్వాత.. తండ్రిపై ప్రశ్నలు సంధించిన తర్వాత.. సోదరుడిపై పరోక్ష యుద్ధం ప్రారంభించిన తర్వాత.. కవిత వ్యవహారం బీఆర్ ఎస్‌లో యూటర్న్ తీసుకుంది.
ఆమె చేస్తున్న పోరాటాలు.. కేవలం ఆరాటాలుగానే మారుతున్నాయి. ఆమెను పెద్దగా ఎవరూ పట్టించుకోవడమే లేదు. ఆమె ఉద్యమాలు, నిరసనల పేరుతో చేపడుతున్న కార్యక్రమాలకు కూడా పెద్దగా స్పందన లభించడమూ లేదు. మొత్తంగా బీఆర్ ఎస్‌లో ఉన్న.. కవితను పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో ఆమె తాడో పేడో తేల్చుకునేందుకు రెడీ అయిన విషయం కూడా తెలిసిందే. అయితే.. అది కూడా సాగకుండా వ్యవహారం మరింత జఠిలంగా మారిపోయింది. తాజాగా బీఆర్ ఎస్ అధినాయ కత్వం తీసుకున్న సంచలన నిర్ణయం కవితకు.. పెద్దషాక్ ఇచ్చింది. ఇటీవల కాలంలో జరిగిన పరిణామాలకు భిన్నంగా ఇది మారింది.
ఆ మాట అన్నాకేనా?
కవిత ప్రస్తుతంతెలంగాణ బొగ్గుగనుల కార్మిక సంఘానికి బీఆర్ ఎస్ తరఫున గౌరవ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. 2014 లో రాష్ట్రంలో బీఆర్ ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా ఆమెనే గౌరవ అధ్యక్షురాలిగా పార్టీ కొనసాగిస్తోంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. కార్మిక సంఘాలకు కూడా కవిత నేతృత్వం వహిస్తున్నారు. కానీ.. ఇటీవల బీఆర్ ఎస్‌తో ఆమె విభేదిస్తు న్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని రోజుల కిందట.. తన పదవి గురించి ప్రస్తావిస్తూ.. తెలంగాణ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా తానే ఉంటానని.. కార్మిక సంఘాలకు తిరుగులేని మద్దతు ఇస్తానని పార్టీ పేరుఎత్తకుండానే కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలు చేసిన వారంలోనే ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి కవితను పక్కకు పెట్టేశారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడిగా పార్టీ కీలక నాయకుడు.. కొప్పుల ఈశ్వర్‌రావును నియమిస్తూ... కార్మిక సంఘం నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ ఎస్ పెద్దలు చక్రం తిప్పడం వల్లే.. ఈ మార్పు చోటు చేసుకుందన్న వాదన వినిపిస్తోంది. ఇక, నుంచి కొప్పుల ఈశ్వరే తెలంగాణ బొగ్గుగని కార్మికుల సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని పార్టీ ఓ ప్రకటన జారీ చేసింది. ఈ పరిణామంపై కవిత ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.