విద్యా శాఖా, ఐటీ మంత్రిగా నారా లోకేశ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అహర్నిశలు రాష్ట్రాభివృద్ధి కోసం శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే యువతకు లోకేశ్ గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు 'నైపుణ్యం పోర్టల్'ను తీసుకురాబోతున్నామని ప్రకటించారు. అంతేకాదు, దేశానికే ఆదర్శంగా నిలిచేలా ఆ పోర్టల్ ను రూపొందించాలని అధికారులను లోకేశ్ ఆదేశించారు.
పరిశ్రమల అవసరాలకు, యువత నైపుణ్యాలకు మధ్య వారధిగా ఈ పోర్టల్ పనిచేయనుందని చెప్పారు. సెప్టెంబర్ నెలలో ఈ పోర్టల్‌ను లాంచ్ చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. దేశంలో మరెక్కడా ఇలాంటి సమగ్రమైన పోర్టల్ లేదని అధికారులను లోకేశ్ ప్రశంసించారు. ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ స్కీమ్‌తో 'నైపుణ్యం పోర్టల్'ను అనుసంధానించాలని సూచించారు. ఈ పోర్టల్ ద్వారా రాష్ట్రంలోని నైపుణ్య కేంద్రాలు, న్యాక్, సీడాప్‌లను ఒకే వేదికపైకి తీసుకువస్తున్నామన్నారు. ఈ పోర్టల్ ద్వారా ఏటా సుమారు 50 వేల మంది యువతకు వివిధ రంగాల్లో శిక్షణ ఇవ్వబోతున్నారు.