మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయన చేస్తున్న, చేయబోతున్న సినిమాల నుంచి వచ్చిన ట్రీట్స్ అభిమానుల్లో బాగానే ఉత్సాహం నింపాయి. అన్నింట్లోకి అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరు చేస్తున్న సినిమా ఫ్యాన్స్‌లో మంచి ఊపు తీసుకొచ్చింది. వింటేజ్ చిరును గ్లింప్స్‌లో చూపించి సినిమా మీద అంచనాలను పెంచాడు అనిల్ రావిపూడి. కొన్ని రోజులుగా మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లే ఈ సినిమాకు మన శంకర వరప్రసాద్ గారు అనే టైటిల్ ఖరారు చేసిన అనిల్.. చిరును స్లైలిష్ అవతార్‌లో ప్రెజెంట్ చేశాడు.
ఇక గ్లింప్స్ అంతటా ప్లే అయిన బ్యాగ్రౌండ్ స్కోర్ చిరు అభిమానులకు వింటేజ్ ఫీల్ ఇచ్చిందనడంలో సందేహం లేదు. చిరు వీరాభిమానులకు ఆ బీజీఎంను గుర్తు పట్టడం కష్టమేమీ కాదు. రౌడీ అల్లుడు సినిమాలోని లౌలీ మై హీరో పాటలోని మ్యూజిక్ బిట్‌ను తీసుకుని దానికి తనదైన టచ్ ఇచ్చి అభిమానుల్లో జోష్ నింపాడు భీమ్స్ సిసిరోలియో. ఐతే టీజర్‌లో బీజీఎం కోసం రౌడీ అల్లుడు పాటను రెఫరెన్సుగా తీసుకోవాలని చెప్పింది అనిలేనట. ఈ విషయాన్ని గ్లింప్స్ లాంచ్ వేడుకలో అనిల్ స్వయంగా వెల్లడించాడు.
కేవలం టీజర్లోనే కాక సినిమాలోనూ పలు చోట్ల ఈ మ్యూజిక్ వినిపిస్తుందని అనిల్ తెలిపాడు. మన శంకర వరప్రసాద్ సినిమా థీమే ఆ మ్యూజిక్ మీద ఆధారపడి ఉంటుందని చెప్పాడు అనిల్. తాను రెఫరెన్స్ ఇవ్వగానే భీమ్స్ ఆరు రకాలుగా దాని మీద మ్యూజిక్ బిట్స్ చేసి ఇచ్చాడని.. అవి సినిమాలో భలేగా అనిపిస్తాయని అనిల్ చెప్పాడు. భీమ్స్‌తో పని చేయడం చాలా సౌకర్యంగా ఉంటుందని చెప్పిన అనిల్.. ఒక సన్నివేశం షూట్ చేయడానికి ముందే అతను బీజీఎం ఇచ్చేస్తాడని చెప్పాడు.
సినిమా చిత్రీకరణ మొదలు కాకముందే అతను నాలుగు పాటలు కంపోజ్ చేసి ఇచ్చినట్లు తెలిపాడు. అన్నపూర్ణ స్టూడియోలోనే తన మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతాయని.. అక్కడికి టాలీవుడ్ వెళ్లి ఈజీగా పని చేయించుకోవచ్చని అనిల్ చెప్పాడు. ఇక ఈ సినిమాలో వెంకీ పాత్ర ఎంతసేపు ఉంటుంది, అది క్యామియోనా, స్పెషల్ రోలా అని అడిగితే అనిల్ సమాధానం చెప్పలేదు. తాను చిన్న హింట్ ఇస్తే దాని మీద ఏవేవో అల్లేసి వార్తలు రాసేస్తారని.. కాబట్టి దాని గురించి ఇప్పుడేమీ మాట్లాడనని అనిల్ తేల్చేశాడు.