గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి అనంతరం వైసీపీ నుంచి చాలామంది సీనియర్లు, కీలక నాయకులు సైడ్ అయ్యారు. తమ రాజకీయ భవిష్యత్తు కోసం అధికార పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. అయితే ఇప్పుడు వైసీపీకి చెందిన మరో సీనియర్ నేత కూడా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధం అవుతున్నట్టు బలంగా వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆయన మరెవరో కాదు కరణం బలరామకృష్ణ. రాజకీయాల్లో కరణం బలరాం సుదీర్ఘ నేపథ్యం కలిగి ఉన్నారు.
1978లో కాంగ్రెస్ నుంచి పాలిటిక్స్ ప్రారంభించారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఎన్టీఆర్ పిలుపుమేరకు ఆ పార్టీలో చేరిన కరణం.. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, అలాగే ఎంపీగా సేవలు అందించారు. ప్రకాశం జిల్లాలో టీడీపీకి పెద్దదిక్కుగా నిలిచారు. చంద్రబాబుతో కూడా సన్నిహితంగా మెలిగేవారు. 2019 ఎన్నికల్లో వైసీపీ వేవ్‌కు టీడీపీ కొట్టుకుపోయినా చీరాల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కరణం బలరాం మాత్రం విజయం సాధించారు. కానీ ఆ తర్వాత వ్యాపార పరంగా ఇబ్బందులు ఎదుర్కోవడంలో కరణం బలరాం టీడీపీని వీడి వైసీపీలో చేరారు.
2024 ఎన్నికల్లో కారణంకు బదులుగా ఆయన కుమారుడు వెంకటేష్ వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. వెంకేటష్‌కు బాపట్ల జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్ష బాధ్యతల్ని ఇస్తారని భావించినప్పటికీ.. అది జరగలేదు. మరోవైపు గత ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చింది. దాంతో టీడీపీని వీడటం తప్పుడు చర్యగా భావించిన కరణం బలరాం.. మళ్లీ సొంత గూటికే చేరాలని ఫిక్స్ అయ్యారు. అందులో భాగంగానే వైసీపీలో సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాలకు కూడా తండ్రీకొడుకులు దూరంగా ఉంటున్నారు.
ఈ మధ్య ఓ ఫంక్షన్ లో సీఎం చంద్రబాబు, కరణం బలరాం సన్నిహితంగా మాట్లాడుకోవడం హైలెట్ అయింది. అప్పటినుంచీ కరణం పార్టీ మార్పుపై వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే టీడీపీ నుంచి కుమారుడు వెంకటేష్ రాజకీయ భవిష్యత్తుపై భరోసా వస్తే కరణం బలరాం సైకిల్ ఎక్కేయడం ఖాయమంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి సంతనూతలపాడు నియోజకవర్గం రిజర్వేషన్ మారితే ఆ స్థానం నుంచి తనయుడ్ని బరిలోకి దింపాలని కరణం భావిస్తున్నారట. మరి అందుకు బాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లేదా? అన్నది చూడాలి.