బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం `పరమ సుందరి`. తుషార్ జలోటా దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 29న విడుదల కాబోతుంది. కేరళ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో మలయాళీ యువతిగా సుందరి దామోదరం పిళ్లై పాత్రలో జాన్వీ అలరించబోతుంది. అయితే ఇటీవల ట్రైలర్ విడుదల అయ్యాక జాన్వీ పాత్రపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. సుందరి పాత్రలో జాన్వీ యాసపై మలయాళీల నుంచి విమర్శలు వ్యక్తం అయ్యాయి.
నార్త్ కు చెందిన జాన్వీ కపూర్ ను బలవంతంగా మలయాళ యువతిగా చూపించడాన్ని పలువురు మాలీవుడ్ తారలు సైతం తప్పుబడ్డారు. సుందరి పాత్రకు కేరళలో నటీమణులు లేరా? అంటూ ప్రశ్నించారు. అయితే తాజాగా జాన్వీ కపూర్ ట్రోలర్స్ కు తనదైన శైలిలో ఇచ్చిపడేసింది. `నేను మలయాళీ అమ్మాయిని కాదు. మా అమ్మ శ్రీదేవి కూడా మలయాళీ కాదు. అయినప్పటికీ ఆమె దక్షిణాది సినీ పరిశ్రమలో ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్నారు.
నాకు కేరళ సంస్కృతి అంటే ఎంతో ఆసక్తి, మలయాళ చిత్రాలకు నేను పెద్ద అభిమానిని. పరమ సుందరి మూవీలో నేను మలయాళీగానే కాదు తమిళ యువతిగా కూడా కనిపిస్తాను. ఇది మంచి వినోదాత్మక కథ. ఈ చిత్రంలో భాగం కావడం ఎంతో ఆనందంగా ఉంది.` అంటూ జాన్వీ కపూర్ ట్రోలర్స్ కు సమాధానమిచ్చింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.