బాల‌య్యకు మ‌రో అరుదైన గౌరవం.. ఇండియాలోనే తొలి హీరోగా రికార్డ్‌!

admin
Published by Admin — August 24, 2025 in Movies
News Image

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌కు మ‌హ‌ర్ద‌శ న‌డుస్తోంది. ఆయ‌న పట్టింద‌ల్లా బంగార‌మే అవుతోంది. ఆ మధ్య‌ పద్మ భూషణ్, ఆపై జాతీయ పుర‌స్కారం అందుకున్న బాల‌య్య‌కు తాజాగా మ‌రో అరుదైన గౌర‌వం ద‌క్కింది. భారతీయ సినిమా చ‌రిత్ర‌లో బాల‌కృష్ణ హీరోగా ఇటీవ‌లె 50 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా బాల‌య్య‌ను యూకేలోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్ గుర్తింపుతో సత్కరించింది. 


ఈ మేర‌కు `ఇండియ‌న్ సినిమాలో ప్రధాన హీరోగా 50 ఏళ్లకు పైగా కొన‌సాగిన‌ మీ అద్భుత నటన, కళామతల్లికి మీరు అందించిన సేవను గుర్తించడం ఆనందంగా ఉంది. 5 దశాబ్దాల సినీ ప్రయాణంలోనే కాకుండా 15 ఏళ్లుగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఛైర్మన్‌గా సమాజానికి మీరు చేసిన నిరంతర సేవను గుర్తించి మీ పేరును వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చేర్చామని చెప్పేందుకు సంతోషిస్తున్నాం` అంటూ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.


అయితే ఇండియ‌న్ ఫిల్మ్ హిస్ట‌రీలో ఇలాంటి గౌరవం పొందిన తొలి హీరోగా బాలకృష్ణ రికార్డు సృష్టించారు.  ఈ అరుదైన విజయాన్ని స్మరించుకునేందుకు ఆగస్టు 30న హైదరాబాద్‌లో ఒక భారీ సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. దీంతో అభిమానులు, సినీ ప్రియులు, టాలీవుడ్ ప్ర‌ముఖులు బాల‌య్య‌కు అభినంద‌న‌లు తెలుపుతున్నారు. కాగా, సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం బాల‌య్య బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో `అఖండ 2` మూవీ చేస్తున్నారు. అదేవిధంగా ఆయ‌న నెక్స్ట్ ఫిల్మ్ `ఎన్‌బీకే111` గోపీచంద్ మ‌లినేనితో ఖ‌రారైంది.

Tags
Balakrishna World Book Of Records UK Gold Edition NBK Tollywood
Recent Comments
Leave a Comment

Related News