గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని చాలామంది హీరోయిన్లు ఆరాటపడుతున్నారు. కానీ రీసెంట్‌గా ఓ మలయాళ నటి చరణ్ తో నటించే అవకాశం వస్తే నిర్మొహమాటంగా నో చెప్పేసింది. ఇంతకీ ఆమె ఎవరు? ఎందుకు రాంచరణ్ తో నటించడానికి నిరాకరించింది? అన్న విషయాలు తెలుసుకుందాం పదండి. ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో `పెద్ది` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. క్రీడా నేపథ్య కథతో పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే పెద్ది మూవీలో అవకాశం రాగా మలయాళ నటి శ్వాసిక తిరస్కరించింది. అందుకు కారణం ఆమెకు ఆఫర్ చేసింది తల్లి పాత్ర కావడమే. శ్వాసిక వయసు 33 ఏళ్లు. మలయాళ, తమిళ భాషల్లో ఆమె పలు మధ్య వయసు గల పాత్రలు చేసిన మాట వాస్తవమే. అంతమాత్రాన 40 ఏళ్ల వయసున్న రామ్ చరణ్ కు తల్లిగా నటించమని అడిగితే కోపం రాకుండా ఉంటుందా..? అందుకే శ్వాసిగా సున్నితంగా పెద్ది సినిమాను తిరస్కరించింది. చిత్ర బంధం మళ్లీ మళ్లీ అడిగినా కూడా శ్వాసిక మాత్రం ఒప్పుకోలేదు.
`గతంలో ఒకటి రెండు తల్లి పాత్రలు చేయడం వల్ల ఏకంగా పెద్ది మూవీలో హీరోకి తల్లిగా నటించమని అడిగారు. ఈ మూవీ చేస్తే నా కెరీర్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ ఇప్పుడే అలాంటి రోల్స్ చేయడం పట్ల నాకు ఆసక్తి లేదు. అందుకే రామ్ చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశాన్ని వదులుకున్నాను` అంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్వాసిక వెల్లడించింది. దీంతో ఇప్పుడీ మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా శ్వాసిక తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. ఇటీవల విడుదలైన నితిన్ `తమ్ముడు` సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో శ్వాసిక కనిపించింది. తన నటనతో విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది.