రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అవుతున్నారంటే.. దానికొక లెక్క ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. వాస్తవానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుసుకోవడం, చర్చించుకోవ డం అనేది కామనే. అయితే.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలు, రాజకీయ విభేదాల కారణం గా.. ఈ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కలుస్తున్నారంటే పెద్ద ఎత్తున ఆసక్తి ఏర్పడుతుంది. గతంలో ఏపీ సీఎం జగన్- తెలంగాణ అప్పటి సీఎం కేసీఆర్ అయినా.. ప్రస్తుత చంద్రబాబు-రేవంత్ రెడ్డి అయినా.. భేటీకి ప్రాధాన్యం ఉంది.
తాజాగా వీరిద్దరూ మరోసారి భేటీ అయ్యేందుకు ముహూర్తాలు చూసుకుంటున్నారు. దీనికి ఇరురాష్ట్రాలకు సంబంధించిన కీలక ఉమ్మడి ప్రాజెక్టు ఉండడం, పైగా ఇది రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఉమ్మడి డ్రీమ్ ప్రాజెక్టు కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. తెంలగాణ సీఎం రేవంత్ రెడ్డి.. హైదరాబాద్‌లో ఉన్న సైబరాబాద్, హైటెక్ సిటీలను మించి.. కొత్త ప్రాజెక్టును భుజాన ఎత్తుకున్నారు. తన పేరు చిరస్థా యిగా ఉండాలని భావిస్తున్న రేవంత్ రెడ్డి.. `ఫ్యూచర్ సిటీ`ని ప్రతిపాదించారు.
దీనికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా రెడీ అవుతున్నాయి. సువిశాలంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయనున్నారు. ప్రపంచానికే తలమానికంగా ఉంటుందని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ ఫ్యూచర్ సిటీని.. ఏపీలోని అమరావతికి కలుపుతూ.. భారీ ఎత్తున గ్రీన్ కారిడార్‌ను నిర్మించాలన్న ప్రతిపాదన వచ్చింది. దీనిపై రెండు మాసాల కిందటే ఓకే చెప్పడం.. ఇరు రాష్ట్రాలు కూడా దీనిలో భాగస్వామ్యం కావడం.. కేంద్రానికి ప్రతిపాదనలు కూడా పంపించడం జరిగాయి.
ఇక, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ-అమరావతిని కలుపుతూ.. ఏర్పాటు చేసే గ్రీన్ ఫీల్డ్ 6 లైన్ల రహదారికి సంబం ధించి ఇరు రాష్ట్రాలు ఉమ్మడిగా ఒక ప్రణాళిక వేసుకుని.. భూ సేకరణ చేయాల్సి ఉంటుంది. దీనిని కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తే.. అప్పుడు అమరావతి ని కలుపుతూ.. రోడ్డును నిర్మించనున్నారు. ఈ నేపథ్యంలో భూసేకరణ సహా.. ఇతర అంశాలకు సంబంధించి.. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు త్వరలోనే భేటీ కానున్నారు. దీనికి సంబంధించి సమయం చూస్తున్నారు. కాగా.. గత రెండు మాసాల కిందట.. రెండు తెలుగు రాష్ట్రాల జల వివాదాలు, విభజన అంశాలపై హైదరాబాద్‌లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయిన తర్వాత.. ఇదే మరో భేటీ కావడం గమనార్హం.