అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, జూనియర్ ఎన్టీఆర్ ను మరియు ఆయన తల్లిని అసభ్యకర పదజాలంతో దూషిస్తున్నట్లుగా `వార్ 2` విడుదల రోజు ఓ ఆడియో క్లిప్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆడియో క్లిప్ ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాకే పరిమితం కాకుండా రోడెక్కారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు.
దగ్గుబాటి ప్రసాద్ ఎన్టీఆర్ కు బహిరంగ క్షమాపణలు చెప్పాలని.. లేనిపక్షంలో ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ టీడీపీ అధిష్టానాన్ని తారక్ ఫ్యాన్స్ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతున్న ఆడియో క్లిప్‌లోని వాయిస్ తనది కాదని ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు. అయిన కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెనక్కి తగ్గడం లేదు. దగ్గుబాటికి వ్యతిరేకంగా నినాదాలు వినిపిస్తూనే ఉన్నారు. మరోవైపు విపక్ష వైసీపీ ఇదే అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని టీడీపీపై విమర్శలు గుప్పిస్తోంది.
అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీరు కరెక్ట్ కాదంటూ తాజాగా ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అభిప్రాయపడ్డారు. తాజాగా ఆయన ఎన్టీఆర్ వివాదంపై స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ గురించి తాను ఎక్కడా ఏమీ అనలేదని ఎమ్మెల్యే ప్రసాద్ వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఆ అంశంపై వివాదాన్ని కొనసాగించడం భావ్యం కాదని మంత్రి పయ్యావుల కేశవ్ తారక్ అభిమానులు హితవు పలికారు.
అదీకాకుండా రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్లు తొలగించనుందని వస్తున్న ఆరోపణలను మంత్రి ఖండించారు. అర్హతపై అనుమానం ఉన్నవారికి మొదట నోటీసులు మాత్రమే ఇస్తామని, వారు మెడికల్ బోర్డు ద్వారా తమ అర్హతను నిరూపించుకోవాల్సి ఉంటుందని పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. ఇక ఇటీవల ప్రారంభించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం సక్సెస్ అయిందని, ఈ సందర్భంగా అనంతపురంలో `సూపర్ సిక్స్ – సూపర్ హిట్` కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని మంత్రి వెల్లడించారు.