కోలీవుడ్ స్టార్ యాక్టర్ జయం రవి, ఆయన భార్య ఆర్తి విడాకులు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. 15 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికినట్లు గత ఏడాది జయం రవి అధికారికంగా మొదట ప్రకటించారు. అయితే తనకు చెప్పికుండా చేసిన ఈ ప్రకటనపై ఆర్తి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. `నేను ఇంకా మాజీ కాలేదు` అంటూ ఆమె సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు చేశారు. ఆ తర్వాత ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఈ స్టార్ కపుల్ పలుమార్లు హెడ్ లైన్స్‌లో నిలిచారు. జయం రవి, ఆర్తి విడాకుల వ్యవహారం గత ఏడాది నుంచి అనేక మలుపులు తిరుగుతూ ముందుకు సాగుతోంది.
అయితే కోర్టులో ఇంకా కేసు నలుగుతుండంగానే జయం రవి తన ఫ్రెండ్ కెనీషా ఫ్రాన్సిస్ తో సన్నిహితంగా ఉండటం కోలీవుడ్‌లో బిగ్ కాంట్రావర్సీగా మారింది. కెనీషా ఫ్రాన్సిస్ ఒక సింగర్ మరియు రైటర్. బాలీవుడ్‌లో రియాలిటీ షోలు, లైవ్ కచేరీల్లో పాడుతూ గుర్తింపు తెచ్చుకుంది. అయితే అధికారికంగా విడాకులు ఇంకా రాకముందే జయం రవి కెనీషాతో ఓ వెడ్డింగ్ ఈవెంట్‌కు బహిరంగంగా హాజరు కావడం, అలాగే పలుమార్లు జంటగా కనిపించడంతో వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారనే వార్తలు గుప్పుమన్నాయి.
కెనీషా కోసమే ఆర్తికి జయం రవి విడాకులు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆర్తి సైతం తన వైవాహిక జీవితంలో సమస్యలు రావడానికి కారణం కెనీషానే అని ఆరోపిస్తోంది. ఇక ఇదే తరుణంలో ప్రియురాలితో కలిసి రవి తిరుమల టూర్ వేయడం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా కెనీషాతో జయం రవి తిరుమల పుణ్యక్షేత్రానికి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారడంతో.. ఆర్తి పరోక్షంగా ఈ విషయంపై రియాక్ట్ అయింది. `నువ్వు ఇతరులను మోసం చేయొచ్చు. నిన్ను నువ్వు మోసం చేసుకోవచ్చు. కానీ దేవుడిని మాత్రం మోసం చేయలేవు` అంటూ భర్తకు ఇన్‌డైరెక్ట్‌గా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.