అదే నిజ‌మైతే.. మీరెలా గెలిచారు: కాంగ్రెస్‌కు బండి కౌంట‌ర్‌

admin
Published by Admin — August 26, 2025 in Politics, Telangana
News Image

కాంగ్రెస్ పార్టీ దేశ‌వ్యాప్తంగా చేస్తున్న ఓట్ల చోరీ ఉద్య‌మంపై బీజేపీ ఎంపీ, తెలంగాణ నాయ‌కుడు, కేంద్ర స‌హాయ మంత్రి  బండి సంజ‌య్ తీవ్రంగా స్పందించారు. ఓట్ల చోరీ ఘ‌ట‌నే నిజ‌మైతే.. తెలంగాణ‌లో, క‌ర్ణాట‌క‌లో మీరెలా గెలిచార‌ని ఆయ‌న కాంగ్రెస్ పార్టీని నిల‌దీశారు. మీరు గెలిచిన చోట ఈవీఎంలు అద్భుతంగా ప‌నిచేశాయా?  మీరు ఓడిన చోట మాత్రం ఈవీఎంలు దొంగ ఓట్ల‌తో నిండిపోయాయా? అని ప్ర‌శ్నించారు. క‌రీంన‌గ‌ర్‌లో తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీ బీహార్ స‌హా ఇత‌ర రాష్ట్రాల్లో చేస్తున్న ఓట్ల చోరీ యాత్ర‌ల‌పై బండి తీవ్రంగా స్పందించారు. ఈ ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం లేద‌న్నారు. కాంగ్రెస్ పార్టీకి ప‌నిలేద‌ని, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌ట్ట‌డం లేద‌ని అన్నారు. ``ఓట్ల చోరీ జ‌రిగి ఉంటే తెలంగాణ‌లో కాంగ్రెస్ వ‌చ్చేదా? క‌ర్ణాట‌క‌లో ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యేదా?. వారికి(కాంగ్రెస్‌) ప‌నిలేదు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌ట్ట‌వు. మాకు.. ప్ర‌జ‌లు, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు మాత్ర‌మే క‌నిపిస్తున్నాయి. వారికి ఈవీఎంలు క‌నిపిస్తున్నాయి.`` అని బండి వ్యాఖ్యానించారు.

తాను 30 ఏళ్లుగా ప్ర‌జాప్ర‌తినిధిగా అనేక సార్లు విజ‌యం ద‌క్కించుకున్నాన‌ని బండి సంజ‌య్ తెలిపారు. వార్డు నుంచి పార్ల‌మెంటు వ‌ర‌కు ప్ర‌జ‌లు త‌న‌ను గెలిపించార‌న్నారు. కానీ, ఇప్పుడు వార్డు స‌భ్యుడిగా గెలిచే స‌త్తాలేని వారు త‌న‌ను విమ‌ర్శిస్తున్నార‌ని అన్నారు. ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ చేసిన ఆరోపణలపై బండి తీవ్రంగా స్పందించారు. వారికి ప‌నిలేకుండా పోయింద‌నిఎద్దేవా చేశారు. కేంద్ర‌మే అన్నీ చేస్తోంద‌ని.. తెలంగాణ‌లో ఒక్క ఇటుకైనా కాంగ్రెస్ ప్ర‌భుత్వం పేర్చిందా? అని బండి నిల‌దీశారు.

పంచాయ‌తీల‌కు ఒక్క న‌యాపైసా కూడా ఇవ్వ‌ని కాంగ్రెస్ పాల‌కులు.. కేంద్రం ఇస్తున్న నిధుల‌నే వాడుతూ.. త‌మ పేరు పెట్టుకుంటున్నార‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు.  ఇప్పుడు కేంద్రం నిధుల‌తోనే ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని ఎద్దేవా చేశారు. రాత్రిపూట యాత్ర‌లు చేయ‌డం కాంగ్రెస్ పార్టీకే చెల్లింద‌న్నారు. ``ఓట్ల చోరీ గురించి కాదు.. ఆయ‌న‌(మ‌హేష్ గౌడ్‌) సీట్ల చోరీ గురించి మాట్లాడాలి.`` అని సంజ‌య్ వ్యాఖ్యానించారు. ప్ర‌తిప‌క్షం-అధికార‌ప‌క్షం క‌లిసి ప‌నిచేస్తున్నాయ‌ని బీఆర్ ఎస్ , కాంగ్రెస్‌ల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. 

Tags
Bandi Sanjay Congress BJP Telangana News Telangana Politics Latest News
Recent Comments
Leave a Comment

Related News