ప్రతి ఏడాది భాద్రపద శుద్ధ చవితి రోజున జరిగే వినాయక చవితి పండుగకు భారతీయ సంప్రదాయంలో అపారమైన ప్రాధాన్యం ఉంది. వినాయక చవితి నాడు గణపతిని ప్రతిష్టించి పూజలు చేయడం ద్వారా జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయని, విద్య, జ్ఞానం, సౌభాగ్యం, ఆరోగ్యం లభిస్తాయని నమ్ముతారు. అయితే వినాయక చవితి అనగానే ముందుగా గుర్తుకొచ్చేది విగ్రహాల తయారీ, వాటి ప్రతిష్టాపన. ప్రతి ఏటా గణపతి విగ్రహాలు కొత్త కొత్త డిజైన్లలో వస్తూ భక్తులను ఆకట్టుకుంటుంటాయి.
కొందరు తమలోని క్రియేటివిటీ అంతా బయటకు తీసి విగ్రహాలను తయారు చేస్తుంటారు. అందులో భాగంగానే ఈ ఏడాది ఓ వెరైటీ వినాయకుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. సాధారణంగా గణపతి విగ్రహాల తయారీకి మట్టి లేదా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఉపయోగిస్తుంటారు. కానీ, సబ్బులు, షాంపూలతో తయారైన వినాయకుడ్ని ఎప్పుడైనా చూశారా? అనంతపురం జిల్లా పామిడిలో అటువంటి వెరైటీ వినాయకుడ్ని తయారు చేశారు.
నిర్వాహకులు తమ సృజనాత్మకతకు కాస్త పదును పెట్టి బొజ్జ గణపయ్యను మట్టితో కాకుండా పూర్తిగా సబ్బులు, షాంపూలతో తీర్చిదిద్దారు. సంతూర్ సబ్బులతో స్వామివారి ప్రధాన దేహాన్ని, లక్స్ సబ్బులతో చెవులను, సింతాల్ సబ్బులతో కాళ్లను తయారు చేశారు. అలాగే మీరా షాంపూ ప్యాకెట్లతో దంతాలను తీర్చిదిద్దారు. ఇక సన్‌సిల్క్, కార్తీక షాంపూలతో పాటు కంఫర్ట్ ప్యాకెట్లను ఉపయోగించి స్వామివారికి హారాలుగా వేశారు. మొత్తం 25 వేల ఖర్చుతో విగ్రహాన్ని తయారు చేశామని నిర్వాహలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వినూత్న వినాయకుడ్ని చూసేందుకు స్థానికులు పోటీపడుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఈ వెరైటీ గణపతి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు.