వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్.. తన తండ్రి, ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ, ఈడీ అధికారులు నమోదు చేసిన కేసులో కీలక పరిణామం చోటు చేసు కుంది. ఈ కేసులో వాన్ పిక్ సంస్థ కూడా ఉన్న విషయం తెలిసిందే. ఈ సంస్థకు వైఎస్ హయాంలో భూ ములు కేటాయించారు. అయితే.. పరోక్షంగా జగన్‌కు చెందిన సంస్థల్లో ఈ సంస్థ పెట్టుబడులు పెట్టింది. ఇది క్విడ్ ప్రోకో(నాకది-నీకిది) కిందకే వస్తుందని సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు.
ఈ క్రమంలో పలు మార్లు సంస్థ ప్రతినిధులను కూడా గతంలో సీబీఐ అధికారులు విచారించారు. అయితే .. సంవత్సరాలు గడిచిన తర్వాత.. అసలు ఈ కేసుతో తమకు సంబంధం లేదని పేర్కొంటూ.. వాన్‌పిక్ సంస్థ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసి.. కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది. దీనిని సీబీఐ అధికారులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టులో పిటిషన్ వేయడం.. కేసుతో సంబంధం లేదని వాన్ పిక్ చెప్పడాన్ని వారు సుప్రీంకోర్టులో సవాల్ చేయగా.. అలా చేయడానికి వీల్లేదని.. కేసును విచారించాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
దీంతో తాజాగా తెలంగాణ హైకోర్టు.. మరోసారివాన్ పిక్ దాఖలు చేసిన(తమకు ఈ కేసుతో సంబంధం లేద ని) పిటిషన్‌పై విచారణ చేసింది. అయితే.. సీబీఐ వాదనలు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో వాన్ పిక్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు పేర్కొంది. కాగా.. జగన్ అక్రమాస్తులో తెలంగాణ హైకోర్టు వ్యవహారం చర్చకు దారితీసింది. గతంలో ఇదే జగన్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని, జైలుకు కూడా వెళ్లిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి కూడా ఈ హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చేసింది. ఆమెకు సంబంధం లేదని పేర్కొంది.
దీంతో సీబీఐ అధికారులు శ్రీలక్ష్మికి క్లీన్ చిట్ ఇవ్వడంపై సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అంతేకాదు.. ఆమెను మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందన్నారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. శ్రీలక్ష్మికి అనుకూలంగా ఆదేశాలు ఇవ్వడంపై తెలంగాణ హైకోర్టు ను మందలించింది. మరోసారి ఈ కేసును విచారించాలని సూచించింది. దీంతో ఇటీవల తిరిగి శ్రీలక్ష్మి పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. ఆమెకు ఇచ్చిన క్లీన్ చిట్‌ను రద్దు చేయడంతోపాటు సీబీఐ అధికారులు మరింత లోతుగా విచారించాలని కూడా సూచించింది.