కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ) అగ్రనేత, మాజీ ఎంపీ సురవరం సుధాకరెడ్డి రెండు రోజుల కింద ట అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన పార్థివ దేహానికి ఆదివారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత.. అంతిమ యాత్ర నిర్వహించి.. గాంధీ ఆసుపత్రికి దానం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు ఆదివారం ఉదయం సురవరం భౌతిక కాయాన్ని ఉంచిన సీపీఐ కేంద్ర కార్యాల యం మగ్ధూం భవన్‌కు వచ్చి ఆయనకు నివాళులర్పించారు.
సురవరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. పార్టీ నాయకులకు సంతాపం ప్రకటించారు. తనకు సురవ రం సుధాకర్‌రెడ్డికి ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. తాను జిల్లా స్థాయి విద్యార్థి నాయకుడిగా ఉన్న సమయంలోనే సురవరం సుధాకర్‌రెడ్డి రాష్ట్రస్థాయి విద్యార్థి సంఘం నాయకుడిగా ఉన్నారని తెలిపారు. రాజకీయాల్లో ఆయన ఒక పంథాను ఎంచుకున్నారని, తాను మరో పంథా ఎంచుకున్నానని చెప్పారు. ప్రాంతాలు వేరైనా నిజాయితీతో కూడిన రాజకీయాలను తాము కొనసాగించామన్నారు.
అనేక విషయాల్లో సురవరం సుధాకర్ రెడ్డి రాజీ లేని పోరాటాలు సాగించారని చంద్రబాబు చెప్పారు. తన హయాంలో విద్యుత్ చార్జీలు పెంచినప్పుడు.. సీపీఐ నేతలు కాంగ్రెస్‌తో కలిసి ఉద్యమానికి దిగారని గుర్తు చేశారు. ఆ సమయంలో తాను సురవరం సుధాకర్‌రెడ్డికి ఫోన్ చేసి చర్చలకు రావాలని పిలిచినట్టు తెలిపారు. అయితే.. ఆయన నిరాకరించారని.. ఏదైనా ఉంటే అఖిల పక్షంతోనే చర్చించాలని.. తాను విడిగా వచ్చి మాట్లాడితే రాజకీయంగా అపార్థాలు చోటు చేసుకుంటాయని సున్నితంగా తిరస్కరించినట్టు గుర్తు చేసుకున్నారు.
పోడు భూమల్లో గిరిజన రైతులకు హక్కులు కల్పించే విషయంలో సుధాకర్‌రెడ్డి తీవ్రంగా పోరాటం చేశార ని గుర్తు చేశారు. ఆయన ప్రమేయంతోనే 1/70 యాక్ట్ తీసుకువచ్చారని తెలిపారు. కొంత మంది కాంగ్రెస్ నాయకులు ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నించి.. పదవులు ఇస్తామని ఆశ చూపినా.. ఆయన చలించలేదని, పదవుల కోసం ప్రయత్నం కూడా చేయలేదన్నారు. తెలుగు భాషపట్ల సురవరానికి ఎంతో మమకారమని.. ముఖ్యంగా తెలంగాణలో తెలుగు కోసం ఆయన ప్రయత్నం చేశారని గుర్తు చేసుకున్నారు.