ఏపీ రాజధాని అమరావతికి బుల్లెట్ రైలు సొబగు రానుంది. రాజధానిని ఇతర ప్రాంతాలతో కలుపుతూ.. ఇటీవల 40 కిలో మీటర్ల మేర కొత్త రైలు మార్గానికి కేంద్రం అనుమతి తెలిపింది. దీంతో తెనాలి, విజయవా డ, అమరావతి, గుంటూరుల మీదుగా రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ఇది రాజధానిని కీలకమైన విజయ వాడతో కనెక్ట్ చేయనుంది. అయితే.. వీటితో పాటు రాజధాని ప్రాంతాన్ని బుల్లెట్ రైలుతోనూ తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. భవిష్యత్తులో రాజధాని ప్రాంతంలో అనేక పెట్టుబడులు రానున్నాయి.
ముఖ్యంగా 20 ఏళ్ల తర్వాత.. రాజధాని అమరావతి.. పెద్ద నగరంగా దేశంలోనే నెంబర్ 1 నగరంగా మారనుంది. దీంతో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే అమరావతిలో బుల్లెట్ రైలు ఉండాలన్నది చంద్రబాబు ఆలోచన ఈ క్రమంలోనే కేంద్రానికి కొన్నాళ్ల కిందటే ప్రతిపాదనలు పంపించారు. దీనికి తాజాగా అనుమతి లభించింది. దీని ప్రకారం.. వచ్చే ఐదేళ్లలో అమరావతిలో బుల్లెట్ రైలు పరుగులు పెట్టే అవకాశం కనిపిస్తోంది.
ఎక్కడి నుంచి ఎక్కడి వరకు..
అమరావతిలో బుల్లెట్ రైలు ప్రతిపాదనకు సంబంధించి.. హైదరాబాద్ -చెన్నై కారిడార్ వయా అమరావతి రాజధాని మార్గంలో ఈ బుల్లెట్ రైలు పరుగులు పెట్టే అవకాశం ఉంది. ఎలైన్ మెంట్ ఇప్పటికే రూపొందించారు. దీనికి కేంద్రం కూడా ప్రాథమిక ఆమోదం లభించింది. ఈ కారిడార్ లో ఏపీలో 8, తెలంగాణలో 6 స్టేషన్లు ఉండనున్నాయి. అలాగే సీమ జిల్లాల నుంచి వెళ్లేలా హైదరాబాద్ -బెంగళూరు కారిడార్ కు సైతం ప్రాథమికంగా పచ్చజెండా ఊపారు. ఈ మార్గంలో తెలంగాణలో 4, ఏపీలో 6, కర్ణాటకలో 3 స్టేషన్లు నిర్మిస్తారు.
పెట్టుబడులకు సుగమం..
రాజధాని అమరావతిలో బుల్లెట్ రైలు ప్రాజెక్టు రావడంతో పెట్టుబడులకు మార్గం సుగమం అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. పెట్టుబడిదారులు.. అభివృద్ధి చెందిన నగరాలవైపు మొగ్గు చూపుతుండ డం... మౌలిక సదుపాయాలకు కూడా పెద్ద పీట వేస్తే.. వాటిపై ఎక్కువగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి గా ఉన్న నేపథ్యంలో అమరావతిలో బుల్లెట్ ట్రైన్ వస్తే.. అది పెట్టుబడులు ఆకర్షించేందుకు మరింత దోహద పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇలా.. మొత్తంగా రాజధానిని ఒక ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే క్రమంలో ప్రభుత్వం ప్రయత్నాలు సఫలం అవుతున్నాయి.