వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి.. గత ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి విజయందక్కించుకున్న సీనియర్ నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని చంపేందుకు ప్లాన్ జరిగిందా? ఆయనను చంపించేందుకు వైసీపీకి చెందిన ఓ కీలక నేత ప్రయత్నించారా? అంటే.. తాజా పరిణామాలు ఔననే సమాధానమిస్తున్నాయి. తాజాగా కోటంరెడ్డిని హత్య చేసేందుకు రౌడీ షీటర్ల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఒకటి వెలుగులోకి వచ్చింది. దీనిలో ``కోటంరెడ్డిని చంపితే.. డబ్బే డబ్బు`` అంటూ.. రౌడీ షీటర్లు మాట్లాడుకుంటున్నట్టు స్పష్టంగా వినిపిస్తోంది. ఈ విషయంపై ఉప్పందగానే ఎమ్మెల్యే కోటంరెడ్డి అనుచరులు కూపీలాగి.. అప్రమత్తమయ్యారు. సంబంధిత సాక్ష్యాలను కూడా సేకరించారు.
దీనిపై ఎమ్మెల్యే కోటంరెడ్డి.. పార్టీ అధిష్టానానికి లేఖ రాసినట్టు సమాచారం. అయితే.. ఈ వీడియోపై ఆయన స్పందించలేదు. తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని కొన్నాళ్లుగా తనకు కూడా అనుమానం ఉందని.. తనకు ఏ పదవీ అవసరం లేదని, తన ప్రాణాలు నిలబెట్టుకుంటే చాలని ఆయన అనుచరులతో వ్యాఖ్యానించారు. మీడియాతో మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. మరోవైపు..ఈ ఘటనపై నెల్లూరు ఎస్పీ స్పందించారు. ఆడియో వ్యవహారంపై ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని చెప్పారు. అదేవిధంగా కోటంరెడ్డికి భద్రత కల్పించే విషయంపైనా ఉన్నతాధికారులతో మాట్లాడనున్నట్టు తెలిపారు.
ఎవరు చేయించారు?
ఇక, కోటంరెడ్డిని రౌడీషీటర్లతో చంపించాలన్న ఆలోచన ఎవరికి వచ్చింది? ఎందుకు? అనే విషయాలు ఆసక్తిగా మారాయి. అయితే.. దీనికి సంబంధించి పేరు బయటకు రాకపోయినా.. ఇటీవల కాలంలో లేడీ డాన్‌గా జిల్లాలో పేరు మోసిన అరుణ వ్యవహారమేనని కోటంరెడ్డి అనుచరులు చెబుతున్నారు. ఆమె కనుసన్నల్లోనే కోటంరెడ్డిని హత్య చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వైసీపీని తరచుగా విమర్శిస్తూ.. జగన్‌పై నిప్పులు చెరుగుతున్న కోటంరెడ్డి హత్య చేస్తే.. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని అరుణకు ఆఫర్ చేశారని.. అందుకే ఆమె రౌడీషీటర్లతో ఈ వ్యవహారంపై చర్చించి ఉంటారని చెబుతున్నారు.
సోషల్ మీడియాలో ప్రచారం..
ఈ వ్యవహారం వెలుగు చూడకముందే.. సోషల్ మీడియాలో కోటంరెడ్డిపై వ్యతిరేక ప్రచారం జరిగింది. ``ముందు నువ్వు ఉండాలి కదా..`` అనే క్యాప్షన్‌తో కామెంట్లు కురిశాయని ఆయన అనుచరులు చెబుతున్నారు. తాము సేకరించిన సాక్ష్యాల ఆధారంగా ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. మరోవైపు ఈ ఫోన్ సంభాషణ ఆధారంగా మొత్తం ఐదుగురు రౌడీ షీటర్లు.. డీల్ కుదుర్చుకున్నారని చెబుతున్నారు. దీనిని మరింతలోతుగా విచారిస్తే తప్ప.. ఎవరి ప్రమేయం ఉందన్నది తెలుస్తుందని అంటున్నారు. ఇదిలావుంటే.. అరుణతో చేతులు కలిపి.. శ్రీకాంత్ అనే జీవిత ఖైదీకి.. పెరోల్ ఇప్పించడంలో శ్రీకాంత్ రెడ్డి సాయం చేశారన్న వార్తలు వచ్చాయి. దీనిని ఆయన కూడా ఒప్పుకొన్నారు. ఇకపై ఎవరికీ సాయం చేయనని కూడా చెప్పారు. ఇంతలోనే ఈ హత్యాయత్నానికి ప్లాన్ చేయడం సంచలనంగా మారింది.