తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న నేత నారా చంద్రబాబు నాయుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నేటికి 30 ఏళ్లు. తొలిసారి సీఎంగా 1995 సెప్టెంబర్ 1న పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాజకీయాలు అంటే కేవలం గెలుపు, ఓటములు మాత్రమే కాదు. సమయానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవడం, సవాళ్లను ఎదుర్కొని ముందుకు సాగడం, ఓటమి తర్వాత తిరిగి లేచి నిలబడగలిగే శక్తి .. ఇవన్నీ ఒక నేతను ప్రత్యేకంగా నిలబెడతాయి. చంద్రబాబు విషయంలో అదే జరిగింది.
1995లో తొలిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రోజునుంచి నేటి వరకు.. మూడు దశాబ్దాల ఈ ప్రయాణంలో ఆయన పాలనలో విజయాలు, పరాజయాలు, సంచలనాలు అన్నీ చోటుచేసుకున్నాయి. పార్టీని కాపాడుకోవడానికి చేసిన పోరాటమే ఆయనకు మొదటి సీఎం కుర్చీ ఇచ్చింది. 1994 ఎన్నికల్లో ఎన్టీఆర్ ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కానీ 1995లో పార్టీలో అంతర్గతంగా విభేదాలు ప్రారంభం అయ్యాయి. ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీపార్వతిని రాజకీయాల్లో కీలకంగా ముందుకు తేవడం చాలామంది జీర్ణయించుకోలేకపోయారు. ఎన్టీఆర్‌కు దగ్గరైన నేతలు, ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు.
మొదటి అడుగు - 1995లో సీఎం పదవి:
అలాంటి సమయంలో పార్టీ భవిష్యత్తు కోసం తానే ముందుకు రావాల్సిన అవసరముందని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అప్పటివరకు ఎన్టీఆర్ అల్లుడిగా, పార్టీ కీలకనేతగా ఉన్న ఆయన.. తనదైన వ్యూహాలతో రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం తీసుకొచ్చారు. టీడీపీ అంతర్గత కలహాలు, రాజకీయ పరిస్థితుల మధ్యే 1995 సెప్టెంబర్ 1న చంద్రబాబు తొలి సారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాతి కాలంలో ఆయన చూపిన సానుకూల దృక్పథం రాజకీయాల్లో బాబుకు పెద్ద బలమైంది.
హైదరాబాద్ సైబర్ సిటీ - ఐటీ విప్లవం:
మొదటిసారి సీఎం అయ్యాక హైదరాబాద్‌ను ఐటీ హబ్గా తీర్చిదిద్దడంలో బాబు ప్రధాన పాత్ర పోషించారు. హైటెక్ సిటీ ప్రాజెక్ట్‌ను ఆయనే ప్రారంభించారు. హైదరాబాద్‌ను సైబరాబాద్ గా మార్చి, యువతకు ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించారు. బిల్ గేట్స్, బిల్ క్లింటన్ వంటి అంతర్జాతీయ నేతలను రాష్ట్రానికి ఆహ్వానించి, ప్రపంచస్థాయి పెట్టుబడులను ఆకర్షించారు. ఫ్లైఓవర్లు, రోడ్లు, రింగ్ రోడ్లు నిర్మాణం ద్వారా హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలను తగ్గించే దిశగా చర్యలు తీసుకున్నారు.
1999 ఎన్నికల విజయం:
1999లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు టీడీపీని ఘనవిజయానికి నడిపించారు. 181 సీట్లు, 44.14 శాతం ఓట్లతో రెండోసారి ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఇది ఆయన పొలిటికల్ కెరీర్‌లో బలమైన స్థానం కలిగించిన ఘట్టం. ఎన్టీఆర్ అసలైన వారసుడెవరో ప్రజలు తమ ఓటుతో తేల్చిచెప్పిన సందర్భం. రెండోసారి సీఎం పదవీ ప్రమాణం చేసిన తర్వాత రాష్ట్ర పరిపాలనలో చంద్రబాబు దూకుడు మరింత కొనసాగింది. అయితే 2004లో కాంగ్రెస్ వేవ్, 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభావం కారణంగా చంద్రబాబు రెండు సార్లు ఓటమి పాలయ్యారు. ఈ పరాజయాలు ఆయన కెరీర్‌లో కఠినమైన సవాళ్లుగా నిలిచినప్పటికీ.. ఆయన వెనక్కి తగ్గకుండా పార్టీని కాపాడారు.
2014 – విభజన తర్వాత తొలి సీఎం:
ఏపీ విభజన తర్వాత 2014 ఎన్నికల్లో చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చారు. విభజనతో ఏర్పడిన సవాళ్ల మధ్యే ఆయన కొత్త రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రాజధాని అమరావతి నిర్మాణం, పెట్టుబడుల రాక, మౌలిక సదుపాయాలపై ఆయన దృష్టి పెట్టారు. 2019లో వైసీపీ ఘనవిజయం సాధించడంతో చంద్రబాబు నాలుగోసారి ఓటమి పాలయ్యారు. ఆ ఐదేళ్ల కాలంలో రాజకీయంగా ఎన్నో సవాళ్లు, అవమానాలు ఎదుర్కొన్నారు. ఇక ఓటములన్నింటినీ అధిగమించి చంద్రబాబు 2024 ఎన్నికల్లో మరోసారి టీడీపీని విజయం దిశగా నడిపించారు. దీంతో ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. చంద్రబాబు రాజకీయ ప్రస్థానం ఎత్తుపల్లాల సమాహారం. ఈ మూడు దశాబ్దాల ప్రయాణం ఆయనను కేవలం ఒక నేతగా కాకుండా, ఒక రాజకీయ పాఠంగా నిలబెట్టింది.