కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి హరీష్ రావు, మేఘ గ్రూప్ అధినేత కృష్ణారెడ్డి లపై ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణ చేశారు. కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావు పాత్ర ఉందని, అందుకే ఆయనను ఇరిగేషన్ శాఖ మంత్రి పదవి నుంచి కేసీఆర్ తప్పించారని సంచలన ఆరోపణలు చేశారు. ఆ ఇద్దరి వల్లే కేసీఆర్ కు అవినీతి మరకలు అంటుకున్నాయని ఆరోపించారు.
వారి వల్లే కేసీఆర్ సీబీఐ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని మండిపడ్డారు. కాళేశ్వరం అవినీతి ఆరోపణల కేసులో ఒక రాజ్యసభ సభ్యుడు కూడా ఉన్నారంటూ ఎంపీ సంతోష్ పై కూడా కవిత పరోక్షంగా షాకింగ్ ఆరోపణలు చేశారు. ఇక, హరీష్ రావు, సంతోష్ల వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. కేసీఆర్ కాలి గోటికి కూడా రేవంత్ రెడ్డి సరిపోరని, వారివల్లే కేసీఆర్ ను రేవంత్ వేలెత్తి చూపుతున్నారని అన్నారు. తనపై గతంలో ఎన్నో కుట్రలు చేశారని, అయినా సరే ఏనాడూ హరీష్ రావు, కృష్ణారెడ్డి ల గురించి మాట్లాడలేదని చెప్పారు. ఈరోజు కేసీఆర్ పై కేసు పెట్టిన నేపథ్యంలో మాట్లాడాల్సి వస్తుందని అన్నారు.