బీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పెట్టిన నిప్పు భగ్గుమంది. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలు పార్టీ అంతర్గత సమీకరణాలను కుదిపేస్తున్నాయి. కవిత చేసిన ఆరోపణల్లో అత్యంత సెన్సిటివ్ పాయింట్.. హరీష్ రావును నేరుగా టార్గెట్ చేయడం. సంతోష్ రావు విషయంలో కొన్ని ఆరోపణలు ఉన్నా.. ఇంతవరకు హరీష్ రావుపై మాత్రం బీఆర్ఎస్‌లో ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు ఎప్పుడూ వినిపించలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగిందని కవిత స్పష్టంగా అంగీకరించడమే కాకుండా, ఆ బాధ్యత తన తండ్రి కేసీఆర్‌ది కాదని, పూర్తిగా హరీష్ రావు, సంతోష్ రావులదే అని స్పష్టంగా చెప్పడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఇది హరీష్ రావు భవిష్యత్ పాత్రను ప్రశ్నార్థకంగా మార్చే ప్రయత్నంగా కనిపిస్తోంది.
కవిత వ్యాఖ్యల తర్వాత బీఆర్ఎస్‌లో ఆమెను సస్పెండ్ చేయాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. మరోవైపు కవిత ప్రెస్‌మీట్ అనంతరం కేసీఆర్ తన ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో పార్టీ ముఖ్య నేతలతో అత్యవసరంగా సమావేశం అవ్వడం చర్చనీయాంశమైంది. కేటీఆర్‌తో పాటు పలువురు సీనియర్లు ఈ భేటీలో పాల్గొన్నారు. కవిత వ్యవహార శైలితో పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందని.. ఆమెను పార్టీలో కొనసాగిస్తే ప్రతిపక్షాలకు ఆయుధమిచ్చినట్టే అవుతుందని మెజారిటీ నేతలు కేసీఆర్‌కు సూచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ద్వారా తెలుస్తోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో కవితపై సస్పెన్షన్ వేటు వేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని.. ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుందనే పుకార్లు ఊపందుకున్నాయి. అంతేకాకు పార్టీ యంత్రాంగం ఇప్పటికే కవితను దూరం పెట్టే చర్యలు ప్రారంభించిందని.. ఆమె పీఆర్వోలను పార్టీ వాట్సాప్ గ్రూపుల నుంచి తప్పించారని, అన్ని కమ్యూనికేషన్లు కట్ అయ్యాయని ప్రచారం జరుగుతోంది.
కానీ, కేసీఆర్ రాజకీయ తీరును బాగా తెలిసిన వారికి మాత్రం, ఆ నిర్ణయం అసాధ్యం అనే నమ్మకం ఉంది. ఎందుకంటే, హరీష్ రావు కోసం తన కుమార్తెను పార్టీ నుంచి గెంటేయడం కేసీఆర్ చేసే పని కాదు. కేసీఆర్ తన రాజకీయాలను ఎప్పుడూ కుటుంబ సమీకరణలతో మిళితం చేస్తారు. హరీష్ రావు కోసం కుమార్తెను త్యాగం చేసే అవకాశం తక్కువ. ఈ నేపథ్యంలో సస్పెన్షన్ డిమాండ్ అనేది కవితపై ఒత్తిడి కోసం సృష్టించిన వాతావరణం మాత్రమే అని భావిస్తున్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో కవితపై కఠిన నిర్ణయం తీసుకోవడం కేసీఆర్‌కు కష్టమే. ఒకవేళ కవితను సస్పెండ్ చేస్తే, ఆమె కొత్త పార్టీ పెట్టుకోవచ్చు. దాని వల్ల బీఆర్ఎస్‌కు కలిగే నష్టం మరింత పెరుగుతుంది. కవితను పూర్తిగా పట్టించుకోకపోతే పార్టీ లోపల హరీష్ రావు వర్గం అసంతృప్తి చెందుతుంది. సో.. కేసీఆర్ ముందున్న సమస్య కేవలం పార్టీకి డ్యామేజ్ కంట్రోల్ చేయడం కాదు. ఒకవైపు కుటుంబంలో అంతర్గత విభేదాలను హ్యాండిల్ చేయాలి, మరోవైపు పార్టీ భవిష్యత్ దిశను కూడా గట్టిగా పట్టుకోవాలి.