తెలంగాణ రాజకీయాలు మరింత హీటెక్కాయి. కేసీఆర్ కుటుంబ రాజకీయాలు మరింత సలసల మరుగు తున్నాయి. బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఎమ్మెల్సీ, తన కుమా ర్తె కవితపై ఆయన సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు తాజాగా పార్టీ కార్యాలయం ఓ ప్రకటన జారీ చేసింది. దీనిలో పార్టీ క్రమ శిక్షణ సంఘం బాధ్యుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి సోను భరత్ కుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శి టీ. రవీందర్‌రావు సంతకాలు చేశారు. పార్టీ లెటర్ హెడ్‌పై ఈ మేరకు రాసి సంతకాలు చేశారు.
లేఖలో ఏముంది?
పార్టీ ఎమ్మెల్సీ కె. కవిత.. ఇటీవల కాలంలో తీసుకున్న నిర్ణయాలు.. వ్యవహరిస్తున్న తీరు.. పార్టీకి తీవ్ర నష్టం కలిగించే రీతిలో ఉన్నాయి. ఆమె వ్యవహరిస్తున్న తీరు.. పార్టీ విధానాలకు వ్యతిరేకం. ఈ నేపథ్యంలో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ.. పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అని లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు మీడియాకు లేఖను జారీ చేశారు.
కవిత ఒప్పుకొంటారా?
సాధారణంగా క్రియాశీలక సభ్యత్వం ఉన్న పార్టీ నాయకుడిని సస్పెండ్ చేయడం సాధారణమే అయినా.. కీలక నాయకుల విషయంలో మాత్రం .. ఇది అంత ఆషామాషీ కాదు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం పార్టీలకు సంబంధించిన వ్యవహారాలను కోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే.. క్రియా శీలక సభ్యత్వం ఉన్న వారిని సస్పెండ్ చేసేముందు.. నోటీసులు ఇవ్వాలి. వారు చేసిన తప్పులపై వివరణ కోరాలి. ఒకటి రెండు సార్లు అవకాశం ఇవ్వాలి.
ఇవేవీ చేయకుండా.. నేరుగా సస్పెండ్ చేయడం కుదరదు. అదేసమయంలో ప్రతి పార్టీకి క్రమశిక్షణ సం ఘం ఉంటుంది. ఇది నిబంధన కూడా. తప్పుచేశారని భావించిన నాయకులను ఈ క్రమశిక్షణ సంఘం విచారించాలి. అప్పుడు కూడా వినకపోతే.. ఒకటి రెండు సార్లు చూసి.. అప్పుడు మాత్రమే సస్పెండ్ చేయాలి. అందుకే.. ఇటీవల కాంగ్రెస్‌లో కొండా మురళి తీవ్ర వ్యాఖ్యలు చేసినా.. ఆయనను నేరుగా సస్పెండ్ చేయలేదు. విచారించారు. ఎన్నికల సంఘం దగ్గరనమోదైన పార్టీలు ఒక విధానం అనుసరించాలి. సో.. దీనిని కవిత కార్నర్ చేసే అవకాశం ఉంటుంది.