వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముగిసిందని సుప్రీంకోర్టుకు సీబీఐ అధికారులు తెలిపిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో దర్యాప్తు కొనసాగించాలని పిటిషనర్ సునీత కోరుతున్నందున సుప్రీం కోర్టు తగిన ఆదేశాలు ఇస్తే దర్యాప్తు కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామని సీబీఐ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ఆ వ్యవహారంపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
సీబీఐ దర్యాప్తు కొనసాగించాలా వద్దా అనే నిర్ణయాన్ని ట్రయల్ కోర్టుకే వదిలేస్తున్నామని సుప్రీం కోర్టు తెలిపింది. ఈ ప్రకారం పిటిషన్ వేసేందుకు సునీతకు సుప్రీం కోర్టు అవకాశమిచ్చింది. ఆ పిటిషన్ పై 8 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని ట్రయల్ కోర్టుకు గడువు నిర్దేశించింది. ఇక, వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డి సహా పలువురు నిందితుల బెయిల్ రద్దు చేయాలంటూ సునీత, సీబీఐ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు మరోసారి విచారణ జరిపింది. ఇప్పటికే సీబీఐ ఫైనల్ ఛార్జిషీట్ ఫైల్ చేసిందని, కాబట్టి నిందితుల బెయిల్ రద్దు అంశంలో జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.