తెెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సారి రేవంత్ పై కేటీఆర్ సెటైరికల్ స్టైల్లో చురకలంటించారు. నిజం చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు చాలా మంచోడని, కాకుంటే నిజాయితీ కలిగిన మోసగాడని చమత్కరించారు. ఆయన ముందే చెప్పాడని, మోసం చేసేవారినే ప్రజలు నమ్ముతారని, కాబట్టి ప్రజలను మోసం చేస్తానని చెప్పే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని అన్నారు. అయితే, ఇందులో రేవంత్ తప్పేమీ లేదని, కాంగ్రెస్ పార్టీ నైజమే మోసమని ఎద్దేవా చేశారు.
గద్దెమీద ఉన్నంత కాలం కేసీఆర్ గొప్పదనం ప్రజలకు అర్థం కాలేదేని, నేడు మారుమూల గ్రామాల్లో ప్రజలు సైతం ఆయనను తలచుకుంటున్నారని అన్నారు. తాము ఓట్లేసినా బీఆర్ఎస్ ప్రభుత్వం రాలేదని కొందరు ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ కు ఓటేసినందుకు కొందరు చెప్పుతో కొట్టుకుంటున్నారని, జన్మలో మరోసారి కాంగ్రెస్ కు ఓటేయబోమని అంటున్నారని గుర్తు చేశారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటింది ఎన్టీఆర్ అని కేటీఆర్ అన్నారు. తెలంగాణ అస్థిత్వాన్ని చాటి చెప్పింది కేసీఆర్ అని కొనియాడారు.