కాదేదీ కవితకన్హం అని మహాకవి శ్రీ శ్రీ చెప్పినట్లు...కలికాలంలో కాదేదీ స్కామ్ కు అనర్హం. ఆఖరికి తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు వీఐపీ బ్రేక్ దర్శనాలు ఇప్పిస్తామని కూడా కేటుగాళ్లు భక్తులను బురిడీ కొట్టిస్తున్నారు. డబ్బులు పంపిస్తే అర్జిత సేవలు అందిస్తామంటూ ఆఫర్లు ఇస్తున్నారు. అయితే, అటువంటి వారిని నమ్మవద్దని, దళారుల మాయమాటలు నమ్మి మోసపోవద్దని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చెబుతున్నారు.
వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవల టికెట్లు ఇప్పిస్తామని కొందరు మోసగాళ్లు అమాయక భక్తులను లక్ష్యంగా చేసుకుంటున్నారని అన్నారు. టీటీడీ ఆఫీసులలో అధికారులమని, మంత్రుల పేషీ సిబ్బంది అని జనాలను మోసం చేస్తున్నారని చెప్పారు. భక్తులను నమ్మించి డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నారని, ఆ తరహా మధ్యవర్తులను ఆశ్రయించవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు.
దర్శన టికెట్లు, వసతి గదులను టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని సూచించారు. భక్తులను మోసం చేస్తున్న దళారులను గుర్తించి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు టీటీడీ ఒక ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించిందన్నారు. దళారులు సంప్రదించిన వెంటనే భక్తులు టీటీడీ విజిలెన్స్ విభాగానికి గానీ, స్థానిక పోలీసులకు గానీ సమాచారం అందించాలని కోరారు.