ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. వాలంటీర్లు గతంలో చేసే విధులను తమతో చేయిస్తున్నారని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా, ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఒకే సమయంలో పలు శాఖలు వేర్వేరు పనులు అప్పగించడం వల్ల తాము ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు. ఈ క్రమంలోనే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది విధులకు సంబంధించి ప్రభుత్వం తాజాగా నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. వారి కోసం నిర్దిష్టమైన జాబ్ చార్ట్‌ను విడుదల చేసింది.
తాజా ఆదేశాలకు విరుద్ధంగా ఏ ప్రభుత్వ శాఖ అయినా కొత్త ఉత్తర్వులు జారీ చేస్తే అవి రద్దైనట్లుగా పరిగణిస్తామని క్లారిటీనిచ్చింది. ఇకపై ఒకేసారి పలు పనులు అప్పగించాల్సిన పరిస్థితుల్లో జిల్లా గ్రామ, వార్డు సచివాలయ అధికారి మరియు సంబంధిత శాఖల జిల్లా అధికారుల సూచనలు పరిగణలోకి తీసుకోవాలని తెలిపింది. వారి సూచనలతోపాటు కలెక్టర్ అనుమతితో పనుల ప్రాధాన్యతను నిర్ణయిస్తారని చెప్పింది. జిల్లా కలెక్టర్లు లేదా నియామకాధికారులు ఈ జాబ్ ఛార్ట్ అమలును పర్యవేక్షిస్తున్నారని, విధులు నిర్వర్తించకపోతే సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేసింది.
ప్రభుత్వం విడుదల జాబ్ ఛార్ట్ ఇదే....
* గ్రామ, వార్డు స్థాయి అభివృద్ధి ప్రణాళికల పనులన్నింటిలో పాల్గొనాలి
* ప్రభుత్వ పథకాల సమర్థ అమలుకు, విస్తరణ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలి
* ప్రభుత్వ ఆదేశాల మేరకు తమ పరిధిలోని పౌరుల సమాచారాన్ని సేకరించాలి
* ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలను ప్రజల ఇళ్ల వద్దకే చేరవేయాలి
* సచివాలయాల ద్వారా అందిన ఫిర్యాదుల పరిష్కారాన్ని నిరంతరం పర్యవేక్షించాలి
* విపత్తు సమయాల్లో అత్యవసర విధులు నిర్వర్తించాలి
* ప్రభుత్వం అప్పగించే ఏ విధులైనా సమయానుసారం నిర్వర్తించాలి
* నిర్ణయించిన పరీక్షలకు అర్హత సాధించాలి