నిజామాబాద్ జిల్లాకు చెందిన కానిస్టేబుల్ ప్రమోద్ విధి నిర్వహణలో దారుణంగా హత్యకు గురయ్యారని.. ఆయన కుటుంబాన్ని ఆదుకుంటామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గోషామహల్ పోలీసు పె రేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ప్రమోద్ దారుణ హత్య ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ప్రమోద్ కు నివాళులర్పిస్తున్నట్టు తెలిపారు. ఆయన కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు.
పోలీసు-అన్న పదం సమాజానికి రక్షణ కవచమని సీఎం అన్నారు. ఈ పేరు ప్రజలకు భరోసా ఇస్తుందని తెలిపారు. మన కోసం రక్తం అర్పించిన పోలీసులు ఎంతో మంది ఉన్నారని తెలిపారు. శాంతి భద్రతల విషయంలో పోలీసులు రాజీలేకుండా కష్టపడుతున్నారని చెప్పారు. ఇటీవల జరిగిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ప్రమోద్ కుటుంబానికి సాయం చేస్తామన్న సీఎం.. వారితో పాటు .. ఈ ఏడాది కాలంలో విధి నిర్వహణలో అమరులైన పోలీసుల కుటుంబాలను కూడా ఆదుకుంటామన్నారు. వారికి ఇళ్లు కూడా ఇస్తామన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో శాంతిభద్రత అంశం కీలకంగా మారిందన్నారు. అనేక మాధ్యమాలు అందుబాటులోకి రావడంతో శాంతిభద్రతలను కాపాడడం పోలీసులకు సవాల్‌గా పరిణమించిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకుని సవాళ్లను అధిగమించేం దుకు పోలీసులు ప్రయత్నించాలని సూచించారు. ముఖ్యంగా సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపాలన్నా రు. అదేవిధంగా డ్రగ్స్, గంజాయి వంటివాటిపై నిరంతరం నిఘా పెట్టాలని సూచించారు. ఇప్పటికే ఈగల్ టీంలు యాక్టివ్‌గా పనిచేస్తున్నాయన్న సీఎం.. హైదరాబాద్‌ను శాంతి భద్రతలకు కేంద్రంగా మార్చాలని సూచించారు.
ఏంటీ సంస్మరణ దినోత్సవం?
అక్టోబరు 21ని పోలీసు అమరవీరుల దినోత్సవంగా నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. భద్రతా విధుల్లో ప్రాణాలు అర్పించిన పోలీసులను స్మరించుకుని వారికి నివాళులర్పిస్తారు. 1959, అక్టోబరు 21న లడఖ్‌లో చైనా దళాలతో జరిగిన పోరులో భారత్-చైనా సరిహద్దులో భద్రతా విధులు నిర్వహిస్తున్న పది మంది సీఆర్ పీఎఫ్ సిబ్బంది అమరులయ్యారు. ఈ నేపథ్యాన్నిపురస్కరించుకుని నాటి నుంచి అక్టోబరు 21ని పోలీసుల అమరవీరుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.