వైసీపీ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు గాడి తప్పాయని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. జగన్ దెబ్బకు భయపడి పారిశ్రామికవేత్తలు ఏపీ వైపు చూడడం మానేశారు. అయితే, 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో లా అండ్ ఆర్డర్ గాడిన పడింది. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజారంజక పాలనను అందించడంతో ప్రజలతో పాటు పారిశ్రామికవేత్తలు కూడా ప్రశాంతంగా ఉన్నారు. ఈ క్రమంలోనే నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి చంద్రబాబు నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివని కొనియాడారు. శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతాయని చంద్రబాబు అన్నారు. గూగుల్ రాకకు అదే కారణమని, గూగుల్ బాటలోనే మరిన్ని కంపెనీలు ఏపీ వైపు చూస్తున్నాయని తెలిపారు. రాజకీయ ముసుగులో పెరిగిపోతున్న నేరాలు, విద్వేషాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు. పోలీసుల కుటుంబ సంక్షేమం ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. సోషల్ మీడియా నేరాలు పోలీసులకు పెను సవాలుగా మారాయని అభిప్రాయపడ్డారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి 50 మీటర్లకు ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. పోలీసులకు మూడో కన్నులా కెమెరా పనిచేస్తుందని అన్నారు. డ్రోన్లు, ఫోన్ సిగ్నల్స్, గూగుల్ టేకవుట్ వంటి టెక్నాలజీతో నేరాలను పోలీసులు ఛేదిస్తున్నారని చెప్పారు. అడవుల్లో గంజాయి తోటలను, ఎర్రచందనం స్మగ్లర్లను గుర్తించడానికి డ్రోన్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. ఈగల్, శక్తి బృందాల ఏర్పాటుతో ఏపీ పోలీస్ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు.