హైదరాబాద్‌లోని కీలక నియోజకవర్గం జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో నామినేషన్ల పర్వం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. వాస్తవ సమయం 3 గంటల వరకు కేటాయించినా.. అప్పటి వరకు నామినేషన్లు వేసేందుకు వచ్చిన వారిని ఐదు గంటల వరకు అనుమతించారు. ఇక, చివరి రోజు చివరి క్షణంలో 23 మంది నామినేషన్లు సమర్పించడం గమనార్హం. వీరిలో బీజేపీ అభ్యర్థి లంకల పల్లి దీపక్ రెడ్డి కూడా ఉన్నారు. మిగిలిన వారు స్వతంత్ర అభ్యర్థులు.
మొత్తంగా సాయంత్రం 5 గంటల సమయానికి 151 నామినేషన్లు దాఖలు కాగా.. చివరి నామినేషన్ దాఖలు చేసిన ఓ అభ్యర్థి సంతకాలు భిన్నంగా ఉండడంతో అక్కడికక్కడే దానిని తిరస్కరించారు. దీంతో 150 నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా.. బుధవారం వీటిని అధికారులు స్క్రూటినీ చేయనున్నారు. ఈ నెల 24 వ తేదీ వరకు నామినేషన్లను ఉప సంహరించుకునేందుకు అవకాశం ఉంది. దీంతో కీలక పార్టీల నాయ కులు రంగంలోకి దిగి.. సాధ్యమైనంత వరకు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను ఉపసంహరించుకునే లా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక, 2023లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 120 నామినేషన్లు దాఖల య్యాయి. అయితే.. వాటిని పరిశీలించగా.. మొత్తం 42 నామినేషన్లు మాత్రమే అర్హతపొందాయని అప్పట్లో అధికారులు తెలిపారు. చాలా మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు భారీ సంఖ్యలో నామినేషన్లు పడడంతో ఓటు బ్యాంకు చీలే అవకాశం ఉంటుందని భావిస్తున్న కీలక పార్టీలు స్వతంత్రులను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నాయి. కాగా.. వచ్చే నెల 11న పోలింగ్ జరగనుంది.
ప్రధాన పోటీ వీరి మధ్యే!
నిన్న మొన్నటి వరకు బీఆర్ ఎస్ నాయకురాలు మాగంటిసునీత ఏకపక్షంగా విజయం దక్కించుకుంటార ని భావించినప్పటికీ.. ఇప్పుడు ఆ పార్టీలో ఈ వ్యవహారం చర్చకు దారితీసింది. కాంగ్రెస్ పార్టీమంత్రులు, నాయకులు కూడా భారీ ఎత్తున ప్రచారం చేస్తున్న దరిమిలా.. ఓట్ చోరీ అంశాన్ని కూడా బీఆర్ ఎస్ కీలకంగా భావిస్తున్న నేపథ్యంలో పోటీ తప్పదన్న వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో బీఆర్ ఎస్, కాంగ్రెస్‌ల మధ్య అభ్యర్థులకు అతీతంగా పోటీ ఉండే అవకాశం ఉందని బీఆర్ ఎస్ నాయకులు అంచనా వేస్తున్నారు.