పెట్టుబడులు పెట్టేవారికి ఏపీ స్వర్గధామమని సీఎం చంద్రబాబు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో దుబాయ్ చేరుకున్న సీఎం చంద్రబాబు, మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్‌రెడ్డిలకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. అనంతరం.. వారు వెంటనే పెట్టుబడులపై దృష్టి పెట్టారు. కీలక పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు. ముఖ్యంగా దుబాయ్ ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరిస్తున్న పీఎన్సీ మీనన్‌తో సమావేశమయ్యారు.
దుబాయ్ నుంచి వచ్చే పారిశ్రామిక వేత్తలకు.. ఏపీలో ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చా రు. ముఖ్యంగా ఏపీలో రియాల్టి రంగంలో పెట్టుబడుల అవకాశాలను సీఎం వివరించారు. అదేవిధంగా టౌన్ షిప్ లు, లగ్జరీ హోటళ్ల నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ సహకారం మెండుగా ఉందన్న సీఎం చంద్రబాబు.. పోర్టులున్నాయని.. ప్రతి 50 కిలో మీటర్ల దూరంలో ఒక పోర్టును నిర్మిస్తున్నామనిచెప్పారు. అదేవిధంగా పారిశ్రామిక కారిడార్లు వస్తున్నాయని తెలిపారు.
అమరావతి, విశాఖ, తిరుపతి వంటి ప్రాంతాల్లో కూడా బిజినెస్ ఐటీ పార్కులు, మాల్స్, హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లతో పాటు ఉన్నతశ్రేణి వర్గాలకు హౌసింగ్ ప్రాజెక్టులను చేపట్టేందుకు అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో నిర్మితం అవుతున్న పారిశ్రామిక కారిడార్లు, పోర్టులకు అనుసంధానంగా ఇండస్ట్రియల్ టౌన్ షిప్, హౌసింగ్ ప్రాజెక్టులకు అవకాశం ఉందని ముఖ్యమంత్రి మీనన్ కు వివరించారు.
ఏపీలో పీ4 విధానాన్ని అవలంభిస్తూ అమలు చేస్తున్న జీరో పావర్టీ మిషన్ అంశాలను వివరించారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ది అంశాలను చర్చించారు. దుబాయ్ ప్రభుత్వంలో సీనియర్ సలహాదారుగా ఉన్న మీనన్ ఆ దేశం నుంచి కూడా పెట్టుబడులు వచ్చేలా సహకరించాలని సీఎం కోరారు. వచ్చే నెల 14, 15వ తేదీల్లో విశాఖలో పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తున్నామని... ఆ సదస్సుకు రావాలని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు.