ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి నారా లోకేశ్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పలువురు పారిశ్రామికవేత్తలు, ఐటీ కంపెనీల సీఈవోలతో లోకేశ్ వరుసగా భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో లోకేశ్ కు ఓ సమావేశం సందర్భంగా వింత అనుభవం ఎదురైంది. బ్రిస్బేన్‌లో పారిశ్రామికవేత్తల సమావేశం సందర్భంగా జగన్ పాలనలో తాము గురైన వేధింపుల గురించి శ్రావణ్‌కుమార్ అనే పారిశ్రామికవేత్త చెప్పడం చర్చనీయాంశమైంది. లోకేశ్ ఎదు తన ఆవేదనను ఆయన వెళ్లగక్కారు. వైసీపీ పాలకులు తమను అన్ని విధాలుగా హింసించారని, నానా ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు.
వైసీపీ హయాంలో తమ భూములను అక్రమంగా లాక్కున్నారని, న్యాయపరమైన చిక్కులు సృష్టించి తీవ్రంగా ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. ఆర్థికంగా , రాజకీయంగా తమను ఇబ్బందులపాలు చేశారని వాపోయారు. ఆ వేధింపుల ఒత్తిడిని తట్టుకోలేక తన తండ్రి ప్రాణాలు కోల్పోయారని శ్రావణ్ కుమార్ భావోద్వేగానికి లోనయ్యారు. ఆ భయానక పరిస్థితుల నుంచి బయటపడి ఏపీలో పెట్టుబడులు పెట్టడం సాధ్యమేనా అన్న అనుమానం కలిగిందని లోకేశ్ తో అన్నారు.
ఈ నేపథ్యంలోనే శ్రావణ్‌కుమార్ ఆవేదనపై లోకేశ్ స్పందించారు. శ్రావణ్ తో పాటు పారిశ్రామికవేత్తలందరికీ ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. జగన్ విధ్వంసకర పాలనకు ప్రజలు చరమగీతం పాడారని, గత ఎన్నికల్లో ప్రజలు 94 శాతం స్ట్రయిక్ రేట్‌తో టీడీపీ కూటమికి చరిత్రాత్మక విజయాన్ని అందించారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో పరిస్థితులు మారాయని, పెట్టుబడుల అనుకూల విధానాలను అమలు చేస్తున్నామని అన్నారు. పెట్టుబడులకు ఏపీ స్వర్గధామంగా మారిందని, నిర్భయంగా పెట్టుబడులు పెట్టవచ్చని హామీనిచ్చారు. త్వరలో జరగనున్న విశాఖ భాగస్వామ్య సదస్సుకు రావాలని అందరినీ లోకేశ్ ఆహ్వానించారు.