వైసీపీ అధినేత జగన్ దీపావళి పండుగను పురస్కరించుకుని బెంగళూరులోని తన నివాసంలో సతీమణి భారతితో కలిసి టపాసులు కాల్చారు. సంబరాలు జరుపుకున్నారు. దీనిని ఎవరు తప్పుపట్టాల్సిన అవసరం లేదు. గత ఏడాది ఎన్నికల సమయంలో పార్టీ ఘోరంగా పరాజయం అయిన నేపథ్యంలో గత ఏడాది దీపావళిని జగన్మోహన్ రెడ్డి జరుపుకోలేక పోయారు. అప్పట్లో పార్టీ భయంకరమైన ఓటమిని చవిచూసింది. ఊహించని విధంగా నాయకులు ఓడిపోవడంతో దీపావళికి దూరంగా ఉన్నారు.
ఈ ఏడాది ఏమనుకున్నారో ఏమో తెలియదు గానీ దీపావళి పండుగను సతీ సమేతంగా ఆయన బెంగుళూరు ప్యాలెస్ లో నిర్వహించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారు. అయితే ఈ వ్యవహారంపై సొంత పార్టీలోనే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం వైసీపీలో ఉన్న కీలక నాయకులు చాలామంది జైల్లో ఉన్నారు. వారికి ఇప్పటికీ బెయిల్ రాలేదు. మరోవైపు అక్రమ మద్యం కేసు పార్టీని వెంటాడుతోంది. ఇంకోవైపు పార్టీలో అనిశ్చిత పరిస్థితి కూడా నెలకొంది. జిల్లాల స్థాయిలో నాయకులు సరైన విధంగా పనిచేయడం లేదన్న వాదనా వినిపిస్తోంది.
అంతేకాదు కొందరు నాయకులు కూటమి నాయకులతో కలిసి పనులు చేసుకుంటున్నారని పార్టీని బలోపేతం చేయలేకపోతున్నారని కూడా చెబుతున్నారు. ఇక పార్లమెంటు నియోజకవర్గంలో నియమించిన ఇన్చార్జిలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలా అనేక విషయాలు వైసిపిని కుదిపేస్తున్నాయి. అయితే వీటన్నిటికన్నా ముఖ్యంగా అక్రమ మద్యం కుంభకోణం వ్యవహారంలో అరెస్టై న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి కీలక నాయకులు జైల్లోనే మగ్గుతున్నారు. ఇలాంటి సమయంలో ఇంత హడావుడిగా దీపావళి పండుగను ఘనంగా నిర్వహించుకోవాలిసిన అవసరం ఏంటన్నది వైసిపి నాయకులు ప్రశ్నిస్తున్న మాట.
పోనీ, ఒకవేళ నిర్వహించాలని అనుకుంటే తాడేపల్లి నివాసంలోనే ఆయన పార్టీ నాయకులను పిలిచి నిర్వహించుకుంటే బాగుండేదని అనంతపురానికి చెందిన ఓ మాజీ ఎంపీ ఆఫ్ ది రికార్డుగా మీడియా ముందు వ్యాఖ్యానించారు. ఈ పండుగను తాము బహిష్కరించామని, ఈ సంవత్సరం కూడా తాము పండుగను చేసుకునే పరిస్థితి లేదని ఆయన వ్యాఖ్యానించడం విశేషం. ఎందుకంటే అనేకమంది నాయకులపై ఇంకా కేసులు ఉన్నాయని, అవేవీ పరిష్కారం కాలేదని, పార్టీ పరంగా ఇంకా ప్రజల్లో సానుభూతి పెరగలేదని అని చెప్పుకొచ్చారు. సో మొత్తానికి దీపావళి పండుగ విషయంలో కూడా పార్టీలో అసంతృప్తి నెలకొంది. ఇది వైసీపీ అధినేతను ఇబ్బందికర పరిస్థితికి గురిచేసింది అనేది వాస్తవం అంటున్నారు పరిశీలకులు.