కర్నూలు జిల్లా మళ్లీ విషాదంలో మునిగిపోయింది. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ప్రాణ నష్టానికి కారణమైంది. హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు చిన్నటేకూరు సమీపంలో బైకును ఢీకొని మంటలు అంటుకోవడంతో భారీ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారని తెలుస్తోంది. ఢీకొన్న కొద్ది సెకండ్లలోనే బస్సు మంటల్లో చిక్కుకోవడంతో పలువురు ప్రయాణికులు బయటకు రాలేక సజీవదహనమయ్యారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. కనీసం 20 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు, మరికొందరు తీవ్ర గాయాలతో సమీప ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం తీవ్రత అధికంగా ఉండటంతో బస్సు పూర్తిగా దగ్ధమై శిథిలావస్థకు చేరుకుంది. రెస్క్యూ బృందాలు మంటలను ఆర్పి మృతదేహాలను బయటకు తీశాయి. చాలా మంది గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో బాధితుల కుటుంబాలు ఆవేదనకు గురవుతున్నాయి.
మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం..
ఈ దారుణ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, వారికి తగిన ఆర్థిక సాయం అందజేయాలని ప్రకటించారు. “ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం హృదయ విదారకం. ప్రాణాలు కోల్పోయిన వారిపై గాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబాలకు బలం చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రమాదంలో మరణించిన ప్రతి ఒక్కరి కుటుంబాలకు PMNRF నుండి రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వబడుతుంది. గాయపడిన వారికి రూ. 50,000 ఇవ్వబడుతుంది” అని మోదీ తన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
ప్రధాని కార్యాలయం ప్రకటన ప్రకారం, మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, అలాగే గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రకటించింది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిస్థితిని సమీక్షిస్తోంది. కర్నూలు జిల్లా కలెక్టర్, ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన జరిపారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు రాత్రంతా రక్షణ చర్యలు కొనసాగించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.