 
    భారతీయ నగరాల్లో వివాహేతర సంబంధాలు నానాటికీ పెరుగుతున్నాయి. వీటి కారణంగా ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. ఎంతో మంది తమ జీవితాలను కోల్పోతున్నారు. విడాకులు వైపు మొగ్గు చూపుతున్నారు. అక్రమ సంబంధాల మోజులో నేరాలకు పాల్పడుతున్న ఘటనలు కూడా మనం ఈ మధ్య కాలంలో తరచుగా చూస్తేనే ఉన్నాము. ఈ నేపథ్యంలోనే వివాహ వ్యవస్థలో విశ్వాసఘాతుకానికి పాల్పడుతున్న వ్యక్తులు ఏయే నగరాల్లో అధికారంగా ఉన్నారో గ్లీడెన్ సంస్థ తాజాగా ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేతో కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ వెలుగులోకి వచ్చాయి.
ఈ సర్వే ప్రకారం, వివాహేతర సంబంధాలు అధికంగా ఉన్న నగరాల్లో బెంగళూరు అగ్ర స్థానంలో నిలిచింది. టెక్ హబ్ నగరంగా ప్రసిద్ధి పొందిన బెంగళూరు తర్వాత ముంబై రెండో స్థానంలో, కోల్‌కతా మూడో స్థానంలో, ఢిల్లీ నాలుగో స్థానంలో, పుణె ఐదో స్థానంలో నిలిచాయి.. సర్వేలో వెల్లడించిన వివరాల ప్రకారం, ఎక్కువ సంఖ్యలో ఈ ధోరణి ఐటీ మరియు వైద్య రంగాల్లో పనిచేస్తున్న వృత్తి నిపుణుల్లోనే కనిపిస్తోంది. వృత్తిపరమైన ఒత్తిడి, కుటుంబానికి సరిపడా సమయం కేటాయించకపోవడం, భాగస్వామి అవసరాలను పట్టించుకోవకపోవడం వంటి కారణాలు ఈ పరిస్థితికి దారితీస్తున్నాయని సదరు సంస్థ వివరించింది.
ఇక ఈ పక్క చూపుల ధోరణి సమాజంలో విడాకులు, కుటుంబ కలహాలు పెరగడానికి ప్రధాన కారణంగా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. క్షణిక ఆనందం కోసం తీసుకునే ఇటువంటి తప్పుడు నిర్ణయాలు కుటుంబాలను ధ్వంసం చేయడమే గాక జీవితాలను చీకటిమయంగా మార్చుతాయని నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.