 
    హైదరాబాద్ నగరంలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమవుతోంది. 2023లో బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన మాగంటి గోపీనాథ్ దురదృష్టవశాత్తు జూన్ 2025లో కన్నుమూశారు. ఆయన మరణంతో ఖాళీ అయిన ఈ స్థానం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు వేదిక అయింది. ఈ సీటు కేవలం హైదరాబాదుకే కాదు తెలంగాణ రాజధాని రాజకీయ దిశను నిర్ణయించే సిగ్నేచర్ సీట్ గా పరిగణించబడుతోంది. దీంతో ఈ సీటును దక్కించుకునేందుకు ప్రధాన పార్టీల తీవ్రంగా కసరత్తులు చేస్తున్నాయి.
నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా.. ఈ ఉప ఎన్నికకు 211 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 81 మంది అభ్యర్థులు అర్హత సాధించగా.. 23 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. పైనల్ గా 58 మంది పోటోలో ఉన్నట్లు ఆర్కో సాయిరాం వెల్లడించారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలో ఇంత మంది పోటీ చేయడం ఇదే తొలిసారి. అయితే బీఆర్‌ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలోకి దిగారు. బీఎస్పీ, ఏఐఎంఐఎం, జనసేన, ఎల్‌బీపీ వంటి పార్టీలు కూడా తమ అభ్యర్థులను రంగంలోకి దింపాయి.
మిగిలిన 40 మందికి పైగా స్వతంత్రులు.. వీరిలో కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులు, మాజీ కౌన్సిలర్లు, రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు. జూబ్లీహిల్స్ బైపోల్ లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు తాజాగా ఎన్నికల కమీషన్ గుర్తులు కేటాయించింది. బ్యాలెట్ పేపర్ లో మొదటి స్థానం బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి(కమలం), రెండో స్థానం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్(హస్తం), మూడో స్థానం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత(కారు)లకు కేటాయించారు.
ఇతర స్వతంత్ర అభ్యర్థులకు రోడ్ రోలర్, చపాతీ రోలర్ వంటి గుర్తులను ఈసీ కేటాయించింది. ఈ నిర్ణయంతో బీఆర్ఎస్‌కు కొత్త తలనొప్పి స్టార్ట్ అయింది. గతంలో ఈ గుర్తులను తొలగించాలని బీఆర్ఎస్ ఎన్నికల కమీషన్‌కు విజ్ఞప్తి చేసింది. కారు సింబల్ కు ఈ గుర్తులు దగ్గరగా ఉండటంతో ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఇదే విషయంపై బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేస్తుంది.