కేంద్రంలో ప్రధాని మోదీ, ఏపీలో సీఎం చంద్రబాబు...ఈ ఇద్దరు అనుభవజ్ఞుల పాలన కలగలిపి రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే మోదీపై తాజాగా చంద్రబాబు మరోసారి ప్రశంసలు కురిపించారు. ప్రముఖ జాతీయ మీడియా సంస్థ పీటీఐతో మాట్లాడిన చంద్రబాబు..మోదీని ఆకాశానికెత్తేశారు.
ఈ దశాబ్దం మోదీనేనని, అంటే ఆటోమేటిగ్గా భారతీయులదని చంద్రబాబు అన్నారు. 2000 సంవత్సరం నుంచి మోదీ రాజకీయాల్లో ఉన్నారని, ఎప్పుడూ ఎన్నికల్లో విజయం సాధిస్తూనే వస్తున్నారని చెప్పారు. 2014 నుంచి 11 ఏళ్లుగా ఆయన ప్రధానిగా కొనసాగుతున్నారని, ఇదో రికార్డు అని కొనియాడారు. త్వరలో జరగబోయే బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధిస్తుందని, సీఎం నితీష్ కుమార్ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని చంద్రబాబు ప్రకటించారు.